
దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన చలో, భీష్మ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకున్నాయి. చాలా గ్యాప్ తర్వాత అంటే ఏకంగా ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మరో సారి నితిన్ హీరోగా రాబిన్ హుడ్ సినిమాను తెరకెక్కించాడు వెంకీ కుడుముల. రాబిన్ హుడ్ సినిమాతో అయన హిట్ ట్రాక్ కొనసాగుతుందా లేదా అన్న ఆసక్తి అటు టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో ఉంది. మరో వైపు నితిన్ గత సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణ ఫలితాలు చవిచూసినవే. దీంతో ఈ సినిమా అటు దర్శకుడు వెంకీ కుడుముల తో పాటు హీరో నితిన్ కు ఎంతో కీలకంగా మారింది చెప్పాలి. రాబిన్ హుడ్ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే పెద్దలను కొట్టి...పేదలకు పెట్టడమే. హీరో నితిన్ వరసగా బడా బాబుల ఇళ్లల్లో సంపదను కొల్లగొట్టి ...తాను పెరిగిన అనాధ ఆశ్రమంతో పాటు ఇతర ఆశ్రమాలకు ఈ డబ్బు దానం చేస్తుంటాడు.
ఈ బాధితుల్లో ఏకంగా హోమ్ మంత్రి సన్నిహితులు కూడా ఉండటంతో ఎలాగైనా రాబిన్ హుడ్ ను పట్టుకోవటానికి పోలీస్ లు సీరియస్ గా రంగంలోకి దిగుతారు. దీంతో కొంత కాలం ఈ పనికి గ్యాప్ ఇచ్చి ఉద్యోగంలో చేరటానికి హీరో ఫిక్స్ అయిపోతాడు. సరిగా అప్పుడే రాజేంద్ర ప్రసాద్ నడిపే సెక్యూరిటీ ఏజెన్సీ లో ఉద్యోగానికి వెళ్ళటం...అదే సమయంలో విదేశాల్లో ఫార్మా దిగ్గజ సంస్థ అధినేతగా కుమార్తెగా ఉన్న హీరోయిన్ శ్రీ లీల ఇండియా కి వస్తుండంతో ఆమె సెక్యూరిటీ టీంలో నితిన్ కు కూడా బాధ్యతలు అప్పగిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కథలో ఏ మాత్రం కొత్తదనం లేదు. అదే గంజాయి...ఇంటర్నేషనల్ డీల్స్..గ్రామాల్లో బలవంతంగా సాగు వంటి అంశాలు ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూసి ఉన్నవే. ఇందులో కూడా అవే రిపీట్ అయ్యాయి. సినిమా లో ప్రేక్షకులను నవ్వించిన కాంబినేషన్ అంటే నితిన్, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ల మధ్య వచ్చే కామెడీ ట్రాకే.
ఈ సినిమా కు బలం అంటే వీళ్ళ ముగ్గురి మధ్య వచ్చే సంభాషణలు...కామెడీ ట్రాకే రాబిన్ హుడ్ సినిమాను నిలబెట్టింది. ఇక హీరో నితిన్ ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటాడు. హీరోయిన్ శ్రీ లీల సంపన్న పారిశ్రామిక వేత్త కూతురిగా కనిపిస్తుంది. కానీ ఇందులో ఆమెకు దక్కింది ఏ మాత్రం నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కాదు. ఓన్లీ స్టైల్ గా..రిచ్ గర్ల్ గా కనిపిస్తుంది. జీ వి ప్రకాష తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ద్వారా సినిమా ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. రాబిన్ హుడ్ సినిమా లో డేవిడ్ వార్నర్ పాత్ర అలా వచ్చి ఇలా పోతుంది. ఓవరాల్ గా చూస్తే వెంకీ కుడుముల తన హిట్ ట్రాక్ కొనసాగించాడు అనే చెప్పొచ్చు. మరో వైపు నితిన్ కు ఈ సినిమా కాస్త ఊరట ఇచ్చినట్లే. మైత్రి మూవీ మేకర్స్ ఏ మాత్రం రాజీ పడకుండా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. రాబిన్ హుడ్ లో తన మాటలతో దర్శకుడు వెంకీ కుడుముల ప్రేక్షకులను నవ్వించి...ఏ మాత్రం కొత్తదనం లేని కథ తో చేసినా సినిమాను బతికించుకున్నాడు అనే చెప్పాలి.
రేటింగ్ : 2 .75 \5