సంక్రాంతి సినిమాల సందడికి రంగం సిద్ధం అయింది. ఎప్పటిలాగానే ఈ సంక్రాంతికి మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఫస్ట్ స్లాట్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కి దక్కింది. ఈ సినిమా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు వస్తుంటే...జనవరి 12 నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ విడుదల అవుతోంది. గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅథితిగా హాజరు అయ్యారు. అంతే కాదు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టాలని కామెంట్స్ చేశారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ సినిమా ఈవెంట్ కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అథితిగా హాజరు కాబోతున్నారు. జనవరి తొమ్మిదిన అనంతపురం లో జరిగే ఈ ఈవెంట్ కు నారా లోకేష్ హాజరు అవుతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.
అంటే అబ్బాయి సినిమాకు బాబాయ్...మామ సినిమాకు అల్లుడు ప్రోమోషన్స్ చేస్తున్నట్లు చెప్పొచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు సినిమాలకు రేట్లు పెంచుకోవటంతో పాటు అదనపు షో లకు కూడా అనుమతి మంజూరు చేసింది. 2023 లో కూడా సరిగ్గా జనవరి 12 నే విడుదల అయిన నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహ రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు మరో సారి బాలకృష్ణ సినిమా సంక్రాంతి బరిలో ఉండటంతో ఆయన ఫ్యాన్స్ ఈ సినిమా కూడా పక్కా సక్సెస్ అవుతుంది అనే ధీమాతో ఉన్నారు. మరి సంక్రాంతి రేస్ లో నిలిచే మూడు సినిమాల్లో ఏది ఫస్ట్ ప్లేస్ లో నిలుస్తుందో జనవరి 14 తర్వాత కానీ తెలియదు. అయితే తెలంగాణ టికెట్ రేట్లు పెంపు విషయంలో ఇంతరవరకు స్పష్టత రాలేదు. దిల్ రాజు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సిందే.