సెప్టెంబర్ లో విడుదల కానున్న కీలక చిత్రాల్లో నాని హీరో గా నటించిన ప్యారడైజ్ మూవీ ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి అనేక కారణాలు చెప్పొచ్చు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కలిసి చేసిన దసరా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకుంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లోనే వస్తున్న సినిమా ప్యారడైజ్ కావటంతో సహజంగానే అంచనాలు మరింత పెరిగాయి. మరో వైపు ఇందులో హీరో నాని ఊర మాస్ రోల్ లో కనిపించనున్నారు. ఇటీవల విడుదల అయిన ఏష నాగుల కట్ట మీద పాట దుమ్మురేపిన సంగతి తెలిసిందే. అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ సాధించి ఎన్నో రికార్డు లు కూడా నమోదు చేసింది ఈ పాట. ఈ ప్రత్యేక గీతంలో నానికి జోడిగా కీర్తి సురేష్ ఆడిపాడిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలు మార్లు విడుదల వాయిదా పడ్డ ప్యారడైజ్ సినిమా మరో సారి వాయిదా పడే అవకాశం ఉంది అంటూ గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వీటి అన్నిటికి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ సోమవారం నాడు క్లారిటీ ఇచ్చింది. సెప్టెంబర్ 24 నే ప్యారడైజ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని ప్రకటించింది. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరో పెద్ద అసెట్‌గా మారింది.