ప్రకాష్ రాజ్ అహంకార పూరిత వ్యాఖ్యలు..ఓటమికి ప్రధాన కారణాలు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు చాలా మందికి చాలా పాఠాలు నేర్పాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానల్ తో పోలిస్తే ప్రకాష్ రాజ్ ప్యానల్ లోనే పాపులర్ నటులు ఎక్కువ. కాకపోతే ప్రారంభం నుంచి ప్రకాష్ రాజ్ వ్యవహరించిన తీరు..ఆయనకు మద్దతుగా బహిరంగంగా బరిలో నిలిచి వ్యాఖ్యలు చేసిన నాగబాబులే వీరి ఓటమికి కారణం. నాగబాబు అనవసర వ్యాఖ్యలు... ప్రకాష్ రాజ్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలు కూడా వీరి ఓటమికి కారణం అయ్యాయి. తెలుగుకు జాతీయ అవార్డు తానే తెచ్చానని..తనకు పెద్ద వాళ్ళ మద్దతు అవసరం లేదంటూ వ్యాఖ్యానించి ప్రకాష్ రాజ్ తన ఓటమిని తానే ఖరారు చేసుకున్నారు. పెద్దలు ఓట్లు వేస్తారా? ఆశీర్వదిస్తారా లేదా అన్న విషయం పక్కన పెడితే పెద్ద వాళ్ల ఆశీర్వాదం అవసరం లేదనటమే కాకుండా..అవసరం అయితే పెద్ద వాళ్లను కూడా ప్రశ్నించే వారు కావాలంటూ ప్రకాష్ రాజ్ మాట్లాడారు. ఇది పరిశ్రమలోని చాలా మంది వ్యక్తులకు ఏ మాత్రం నచ్చలేదు. మెగా ఫ్యామిలీ అంతా ప్రకాష్ రాజ్ కే అండగా ఉందని..ఆయన విజయం సాధిస్తారని నాగబాబు పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. అంతే కాదు..మంచు విష్ణుకు అంత తొందర ఎందుకు?. ప్రధాని మోడీని ఎదుర్కోగల వ్యక్తి ప్రకాష్ రాజ్ అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు నాగబాబు.
అసలు ఇక్కడ మోడీ ప్రస్తావన ఎందుకు? ఇవి ఏమైనా జాతీయ ఎన్నికలా?. వెయ్యి మంది కూడా లేని సినిమా స భ్యుల ఓట్లతో కూడిన ఎన్నిక ఇది. అడపాదడపా ఏవో సినిమాలు చేయటం తప్ప వాస్తవానికి సినిమాలకు మంచు విష్ణు దూరం అయి చాలా రోజులే అయింది. కానీ ప్రకాష్ రాజ్ చాలా యాక్టివ్ గా ఉంటూ..ప్రతి కీలక సినిమాలో కన్పిస్తూనే ఉన్నారు. ఆయన ప్యానల్ లో కూడా ఉన్నది పాపులర్ నటులు. అయితే నాగబాబు, ప్రకాష్ రాజ్ వ్యవహరించిన తీరు వీరి ప్యానల్ కు మామూలు డ్యామేజ్ చేయలేదు. అదే సమయంలో మోహన్ బాబు మార్గనిర్దేశనంలో మంచు విష్ణు సీనియర్ నటులైన కృష్ణ, కృష్ణంరాజు, కోటా శ్రీనివాసరావు తదితరుల ఆశీర్వాదాలు తీసుకుని..పోస్టల్ బ్యాలెట్ల దగ్గర నుంచి ఓటింగ్ కు సభ్యులు హాజరయ్యే విషయం వరకూ జాగ్రతలు తీసుకుని పక్కా ప్లాన్ ప్రకారం వ్యవహరించారు. అదే వీరికి బాగా కలిసొచ్చింది. వాస్తవానికి మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు, నటులు అందరూ కలసి మనిషికి ఓ ఏభై మందితో ఓట్లు వేయించినా ఈ పరిస్థితి వచ్చేది కాదని పరిశ్రమకు చెందిన వ్యక్తి వ్యాఖ్యానించారు. సేఫ్ గేమ్ లో భాగం అన్నట్లుగా నాగబాబు మాత్రమే తెరపై కన్పించి అటు చిరంజీవి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ వీటిపై బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా ఉన్నారు.