గ‌రం గ‌రంగా 'మా' స‌మావేశం

Update: 2021-08-22 10:43 GMT

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌లు కొత్త కొత్త రాజ‌కీయాల‌కు తెర‌తీస్తున్నాయి. ఈ సారి గ‌తంలో ఎన్న‌డూలేని రీతిలో పోటీ ఉండ‌టంతో ఈ వ్య‌వ‌హారం ర‌స‌కందాయంలో ప‌డింది. ప‌రిశ్ర‌మ‌లో కీల‌క వ్య‌క్తులు ఒక్కో ప్యాన‌ల్ వైపు ఉండ‌టంతో ఈ సారి గెలుపు ఎవ‌రిని వ‌రిస్తుందో అన్న ఉత్కంఠ అంద‌రిలో నెల‌కొంది. అదే స‌మ‌యంలో అస‌లు ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రుగుతాయ‌న్న‌ది కూడా ఓ ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది. ఈ త‌రుణంలో ఆదివారం నాడు వ‌ర్చువ‌ల్ గా మా స‌ర్వ‌స‌భ్య స‌మావేశం జ‌రిగింది. ఇందులోనూ హాట్ హాట్ చ‌ర్చ‌లు సాగాయి. ఈ స‌మావేశంలో ప్ర‌ముఖ న‌టుడు, సీనియర్‌ హీరో మోహన్‌ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గ‌తంలో 'మా' భవనాన్ని రూపాయికి కొని.. అర్థ రూపాయికి అమ్మేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విష‌యం గురించి ఎవ‌రైనా..ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్ర‌శ్నించారు.

అతి త్వరలో మా ఎన్నికలు పెడతారని భావిస్తున్నానని చెప్పిన మోహన్‌ బాబు... దీనిపై అభిప్రాయాలు తీసుకుని కృష్ణం రాజు తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. మోహ‌న్ బాబు త‌న‌యుడు, హీరో మంచు విష్ణు మా ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అందులోనూ ఆయ‌న ప్ర‌ధాన ఎజెండా కూడా మా కు సొంత భ‌వ‌నం ఏర్పాటు అంశ‌మే అని ప్ర‌క‌టించారు. మ‌రో వైపు ప్ర‌కాష్ రాజ్ తోపాటు మరికొంత మంది కూడా మా ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. ప్ర‌కాష్ రాజ్ కూడా త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌రిపాల‌ని..సెప్టెంబర్‌ 12 లేదా 19న 'మా' ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ కు చిరంజీవి మ‌ద్ద‌తు ఉంది. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్‌ సైతం ఎన్నికలు ఎంత తొందరగా పెడితే అంత మంచిది అని పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నిక‌ల‌పై వారంలోగా ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని కృష్ణంరాజు, మురళీమోహన్ పేర్కొన్నారు. ఈ లెక్క‌న వ‌చ్చే నెల‌లో మా ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం ప‌క్కాగా క‌న్పిస్తోంది.

Tags:    

Similar News