తేజా సజ్జా, మంచు మనోజ్ లు కీలక పాత్రల్లో నటించిన మిరాయి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 55 .60 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. తొలి రోజు ఈ సినిమా కు 27 .20 కోట్ల రూపాయల వసూళ్లు రాగా...విడుదల అయిన రెండవ రోజు ఫస్ట్ డే కంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించటం విశేషం. ఈ సినిమా రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 28.40 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ సండే కూడా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ మధ్య కాలంగా ఇంతగా ఏకాభిప్రాయంతో ఒక సినిమా బాగుంది అని టాక్ వచ్చిన వాటిలో మిరాయి ఉంది అనే చెప్పాలి.
ఇంత మంచి పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా కు చెందిన హెచ్ డీ పైరసీ కాపీ లు పెద్ద ఎత్తున బయటకు వచ్చాయనే ప్రచారం చిత్ర యూనిట్ ను ఆందోళనకు చేస్తోంది. అయితే మిరాయి లాంటి సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప ఈ మూవీ థ్రిల్ ఫీల్ అవటం కష్టం అనే విషయం సినిమా చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాక్షన్స్ సన్నివేశాలు...వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ థియేటర్లోనే మంచి అనుభూతిని కలిగిస్తాయి. మరో వైపు ఏదో హైప్ ఉంది కదా అని చిత్ర యూనిట్ కూడా టికెట్ రేట్లు పెంపు జోలికి వెళ్లకుండా ప్రస్తుతం ఉన్న రేట్లకే ఈ సినిమా ను విడుదల చేసింది.