ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాజాసాబ్ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ తెలంగాణ సర్కారు ఇచ్చిన మెమో ను హై కోర్ట్ కొట్టేసింది. ప్రభుత్వ తీరుపై తెలంగాణ హై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి సారి ఇలా ఎందుకు రేట్లు పెంచుతూ మెమో లు ఇస్తున్నారు అని మండిపడింది. గురువారం అర్ధరాత్రి రాజాసాబ్ టికెట్ రేట్ల పెంపు మెమో జారీ అయింది. అందుకే హైదరాబాద్ లో కొన్ని చోట్ల మాత్రమే పాత రేట్ల తో ప్రీమియర్ షోస్ వేసి ...అర్ధరాత్రి వచ్చిన మెమో ఆధారంగా తెలంగాణా లో సింగిల్ స్క్రీన్స్ లో 105 రూపాయలు..ముల్టీప్లెక్స్ ల్లో 132 రూపాయల లెక్కన రేట్లు పెంచుకోవటానికి అనుమతి ఇవ్వటంతో ఈ రేట్ల ప్రకారం టికెట్స్ విక్రయించారు. దీంతో మల్టిప్లెక్స్ లో ఒక్కో రాజాసాబ్ టికెట్ ధర అన్ని పన్నులు కలుపుకుని 492 రూపాయలు అయింది. ఈ మెమో అర్ధరాత్రి రావటంతో దీనిపై శుక్రవారం నాడు న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన కోర్టు ఈ మెమో ను కొట్టి వేస్తూ పాత రేట్ల ప్రకారమే టికెట్ లు అమ్మాలని బుక్ మై షో ను ఆదేశించింది. ఒక వైపు టికెట్ రేట్లు పెంచబోము ఒక వైపు సంబంధిత శాఖ మంత్రి చెపుతుంటే అధికారులు ఇలా మెమో లు ఎలా జారీ చేస్తున్నారు అని ప్రశ్నించింది.
తాజాగా పరిణామాలతో జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానున్న చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు పై కూడా ప్రభావం పడటం ఖాయంగా కనిపిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కూడా జనవరి 11 రాత్రి నుంచి ప్రీమియర్స్ తో మొదలు అయ్యే అవకాశం ఉంది. రాజాసాబ్ ఎఫెక్ట్ తో తెలంగాణ ప్రభుత్వం ఈ మూవీ ప్రీమియర్స్ కు అనుమతి ఇవ్వటంతో పాటు టికెట్ రేట్ల పెంపునకు అనుమతి వచ్చే అవకాశం లేదు అని టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి. ప్రభుత్వం విధానపరంగా ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప...ఇలా ప్రతిసారి కొత్త సినిమా విడుదల సమయంలో ప్రేక్షకులతో పాటు అందరిని గందరగోళంలో నెట్టడం సరికాదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్లు తక్కువ ఉన్నందున అక్కడ పెంపునకు అనుమతి వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. తెలంగాణాలో చిరంజీవి సినిమాకు కూడా షాక్ తప్పదు అనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. తొలుత రాజాసాబ్ కు లేట్ గా అయినా అనుమతులు రావటంతో చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు మూవీ కి కూడా టికెట్ రేట్ల పెంపునకు అనుమతి వస్తుంది అని ఎక్కువ మంది భావించారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో పరిస్థితి మారిపోయింది.