చిరంజీవి ఫ్యాన్స్ లో కూడా విశ్వంభర సినిమాపై పలు అనుమానాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ సినిమా అప్ డేట్స్ ఏమీ బయటకు రాకపోవటమే. వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ కోసం ఈ సినిమా ను వాయిదా వేసినట్లు అప్పటిలో ప్రచారం జరిగింది. కానీ ఈ సినిమా టీజర్ విడుదల సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో చిత్ర యూనిట్ ఇప్పుడు పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా స్పష్టం చేశారు. ఈ సినిమా కు చెందిన అప్ డేట్ ఇస్తూ ఆయన గురువారం ఉదయం ఒక వీడియో విడుదల చేశారు. ఇందులోనే ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చెప్పారు. విశ్వంభర సినిమా లో చిరంజీవి హీరోగా త్రిష, ఆషిక రంగనాథ్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు.
దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం స్పెషల్ గ్లిమ్స్ గురువారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా విడుదల లో జాప్యం సముచితం అని తాను కూడా భావిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంటుంది అని..ఎలాంటి విమర్శలకు తావు లేకుండా అందరి నుంచి ప్రశంసలు వచ్చేలా దర్శక, నిర్మాతలు ఈ విషయంపై దృష్టి పెట్టారు అని వెల్లడించారు. ఈ సినిమా చందమామ కథలా సాఫీగా సాగిపోతుంది అని..పిల్లలతో పాటు చిన్న పిల్లల మనసు ఉండే పెద్ద వాళ్లకు కూడా ఇది ఎంతో బాగా నచ్చుతుంది అని తెలిపారు. ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కానుంది.