మెగాస్టార్ చిరంజీవి 'లవ్‌స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ కష్టం వచ్చినా ఆదుకునే విషయంలో సినిమా పరిశ్రమ ఎప్పుడూ ముందు ఉంటుందని..ఇప్పుడు కష్టాల్లో ఉన్న సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావాలని కోరారు. సినీ పరిశ్రమ బాధలను సీఎం లు పట్టించుకోవాలన్నారు. పరిశ్రమలో అందరికీ భారీ రెమ్యునరేషన్లు ఉండవన్నారు. ఇలా తీసుకునే వారి సంఖ్య చాలా పరిమితంగా ఉంటుందని తెలిపారు. నలుగురైదుగురి కారణంగా మిగిలిన వారిని చిక్కుల్లో పడేయకూడదన్నారు. పరిశ్రమ ఇప్పుడు తీవ్ర సమస్యల్లో ఉందన్నారు. ఏపీ సీఎం జగన్ కూడా కనికరించి ఆదుకోవాలన్నారు. సినిమా తీయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోందన్నారు. బయట నుంచి చూసేవారికి కన్పించేంత కలర్ ఫుల్ గా ఇక్కడ పరిస్థితులు ఉండవన్నారు. సినిమా పరిశ్రమలో సక్సెస్ రేటు కూడా చాలా తక్కువే అని తెలిపారు. కరోనా సమయంలో షూటింగ్ లు ఆగిపోవటంతో కార్మికులు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు. తామందరం విరాళాలు సేకరించి వీరిని ఆదుకునే ప్రయత్నం చేశామని తెలిపారు. తాము ప్రభుత్వాలను సాయం ఆశగా అడగటటం లేదని..అవసరం కోసం అడుగుతున్నామని వ్యాఖ్యానించారు. లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్, చిరంజీవులు ముఖ్య అతితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి సాయిపల్లవిని ఆటపట్టించేలా మాట్లాడారు.
'భోళా శంకర్' సినిమాలో నాకు చెల్లెలిగా సాయిపల్లవిని అడిగితే ముందు ఆమె తిరస్కరించిందని, అయితే ఆమె నో చెప్పడం తనకు ఎంతో సంతోషం కలిగిందని పేర్కొన్నారు.'సాయి పల్లవి డ్యాన్స్ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అలాంటి అమ్మాయితో డ్యాన్స్ స్టెప్పులేయాలనుకుంటా తప్పా అన్నయ్యా అని పిలిపించుకోవాలనుకోలేదు' అంటూ వ్యాఖ్యారించారు. సారంగదరియా పాట తనకు ఎంతో నచ్చిందని, ఈ పాట కోసమే సినిమాను రెండు-మూడు సార్లు అయినా చూస్తానన్నారు.ఇక నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. 'చాలామంది ఎంగ్ స్టర్స్ ఎగిరెగిరి పడుతుంటారు. కానీ నాగ చైతన్య ఎప్పుడూ కామ్‌గా, కంపోసుడ్‌గా ఉంటాడు. మా తమ్ముడు నాగార్జున లానే.. కూల్ ఫాదర్‌కి కూల్ సన్' అని చిరు పేర్కొన్నారు. లవ్ స్టోరీ సినిమా విజయవంతం కావాలంటూ చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు.