మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కు కొత్తగా ఎన్నికైన మంచు విష్ణు కీలక విషయాలు వెల్లడించారు. తనను మా బరి నుంచి తప్పుకోవాలని చిరంజీవి కోరినట్లు వెల్లడించారు. ప్రకాష్ రాజ్ పోటీలో ఉన్నందున తప్పుకుంటే బాగుంటుందని సూచించారన్నారు. అయితే తాను, తన తండ్రి మోహన్ బాబు ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నందునే ఎన్నికలు జరిగాయన్నారు. మంచు విష్ణు సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. నాగబాబు, ప్రకాశ్ రాజ్‌ల రాజీనామాను ఆమోదించడం లేదని స్పష్టం చేశారు. 'మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతఙ్ఞతలు. నాపై నమ్మకం ఉంచి గెలిపించిన సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇతర రాష్ట్రాల్లో బిజీగా ఉన్న నటులు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు. గెలుపొందేందుకు మా ప్యానల్ అందరం కష్టపడ్డాం. కానీ మా ప్యానల్‌లో కొందరు సభ్యులు గెలవకపోవడం బాధాకరం. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లో గెలిచిన వారిని కలుపుకొని పోతాం. మేమంతా ఒక్కటే. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. నాగబాబు మా కుటుంబంలో సభ్యుడిలాగే. తొందరపడి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించను.
మా అధ్యక్ష స్థానంలో ఉన్న నేను నాగబాబు రాజీనామాను ఆమోదించను. త్వరలోనే ఈ విషయం గురించి స్వయంగా ఆయనతోనే వెళ్లి మాట్లాడతా. అలాగే ప్రకాశ్ రాజ్ రాజీనామాను కూడా ఆమోదించను' అని పేర్కొన్నారు. రామ్ చరణ్ తనకు మంచి మిత్రుడే అని..అయితే ఆయనకు ఓటేయలేదని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. ఎందుకంటే రామ్ చరణ్ వాళ్ళ నాన్న తీసుకున్న స్టాండ్ ను జవదాటడు. అందుకే ఆయన స్టాండ్ కే చరణ్ కట్టుబడి ఉంటారు అని తెలిపారు. నేను మా నాన్న తీసుకున్న స్టాండ్ కు ఎలా కట్టుబడి ఉన్నానో రామ్ చరణ్ కూడా అలాగే చేసి ఉంటారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ వ్యక్తిగత కారణాల వల్లే ఓటింగ్ కు రాలేదని..అవేంటో తనకు తెలుసున్నారు. ఈ విషయాలు బయట పెట్టాల్సిన అవసరం లేదన్నారు. తారక్ మద్దతు తనకు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. మా కొత్త కమిటీ ప్రమాణ స్వీకారం అనంతరం రెండు రాష్ట్రాల సీఎంలను కలసి సినిమా పరిశ్రమలను పరిష్కరించమని కోరతామన్నారు.