మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) రాజకీయం రంజుగా మారుతోంది. ఈ ఎన్నికల మధ్యలో ప్రముఖ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా అత్యంత కీలకంగా మారాయి. మంగళవారం నాడు తన ప్యానల్ సభ్యులతో కలసి మంచు విష్ణు మా ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ పరిశ్రమ వైపు ఉన్నారా? లేక పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారో స్పష్టం చేయాలన్నారు. ఈ విషయాన్ని మీడియా కూడా ఆయన్ను అడగాలన్నారు. తాను మాత్రం పరిశ్రమ వైపే ఉన్నానని తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవించటంలేదని తెలిపారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఏ లేఖ ఇచ్చిందో దానికే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఏపీ సినీ పరిశ్రమకు రెండు కళ్లులాంటివని కౌన్సిల్ ప్రకటించిందన్నారు. తెలుగు పరిశ్రమ బిడ్డగా, నటుడిగా, నిర్మాతగా ఫిల్మ్ ఛాంబర్ లేఖతో ఏకీభిస్తున్నట్లు తెలిపారు.
మోహన్ బాబుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల తర్వాత ఆయనే మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారన్నారు. మా ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం వద్దని మంచు విష్ణు ఈ సందర్భంగా సూచించారు. 'మా' ఎన్నికల్లో తమ ప్యానల్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్యం చేశారు. రేపు లేదా ఎల్లుండి తమ మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. తమ మ్యానిఫెస్టో చూశాక చిరంజీవి, పవన్ కూడా తనకే ఓటు వేస్తారని పేర్కొన్నారు. 'నిర్మాతలు లేకుంటే సినీ ఇండస్ట్రీ లేదు. ప్రతి తెలుగు నటుడి ఆత్మగౌరవ పోరాటం ఇది. నామినేషన్ వేసేందుకు తన నివాసం నుంచి ఫిల్మ్ ఛాంబర్ వరకు భారీ ర్యాలీతో ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకున్న ఆయన నటుడు దాసరి నారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మంచు విష్ణుతో పాటు ఆయన ప్యానల్ సభ్యులు కూడా నామినేషన్ వేశారు.