మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు సంబంధించి ప్రెసిడెంట్ మంచు విష్ణు కీలక విషయాలు వెల్లడించారు. అందులో అత్యంత కీలకమైనది మా నూతన భవనం అంశం కాగా,,రెండవది ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచిన సభ్యుల రాజీనామాల ఆమోదం. కొద్ది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ లో పోటీ చేసి, గెలుపొందిన 11మంది సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రాజీనామాలు వెనక్కి తీసుకోవాల్సిందిగా తాను కోరానని, కానీ వారు అందుకు సిద్ధంగా లేకపోవడంతో నెల రోజుల పాటు వెయిట్ చేసి, రాజీనామాలను అంగీకరించడం జరిగిందని విష్ణు తెలిపారు. మా అసోసియేషన్ వర్క్స్ కోసం వారి స్థానంలో కొత్త సభ్యులను తీసుకున్నట్లు తెలిపారు. అయితే పదవులకు రాజీనామాలు చేసిన వారంతా 'మా' సభ్యులుగా కొనసాగుతారని, నాగబాబు, ప్రకాష్ రాజు కూడా 'మా' సభ్యులుగా ఉంటారని స్పష్టం చేశారు. మా' కమిటీ మీటింగ్ జరిగిందన్నారు. అదే సమయంలో మా బిల్డింగ్ కోసం చర్చలు జరుగుతున్నాయని, వారం రోజుల్లో మా బిల్డింగ్ పై ప్రకటన చేస్తామని తెలిపారు.
'ఆదివారం నాడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'మా' సభ్యులకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ - ''మెడికవర్ హాస్పటల్స్, మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత చికిత్స ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 914 మంది సభ్యులకు వివిధ రకాల మాస్టర్ హెల్త్ చెకప్ లు చేస్తున్నారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని ప్లాన్ చేసిన దగ్గర్నుంచి మాదాల రవి అన్నదగ్గర ఉండి అన్నీ చూసుకున్నారు. మెడికవర్ హాస్పటల్ వారు ముందుకు వచ్చి ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తున్నారు. అన్ని రకాల టెస్టులు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ రెండో వారంలో ఈ హెల్త్ చెకప్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము. మెడికవర్ వాళ్ళు ఫిల్మ్ జర్నలిస్ట్ లకు కూడా ఉచితంగా హెల్త్ చెకప్ లు చేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాను'' అని అన్నారు.