మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ సారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఇప్పటికే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ప్రకటించి ప్రచారంలో ముందు వరసలో ఉన్నారు. ఈ ప్యానల్ కు మెగా ఫ్యామిలీ మద్దతు ఇస్తున్నట్లు పరిశ్రమలో ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. గురువారం నాడు మోహన్ బాబు తనయుడు, హీరో మంచు విష్ణు తమ ప్యానల్ కు చెందిన పోస్టర్ ను విడుదల చేశారు. మంచు విష్ణు ప్రెసిడెంట్ గా పోటీచేస్తున్న విషయం తెలిసిందే.
ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు, బాబుమోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా, మాదాల రవి వైఎస్ ప్రెసిడెంట్ గా, మరో వైస్ ప్రెసిడెంట్ థర్టీ ఇయర్స్ పృధ్వీరాజ్ బరిలో ఉన్నారు. కోశాధికారిగా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కళ్యాణి, గౌతంరాజులు ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా అర్చన (వేద), అశోక్ కుమార్, గీతాసింగ్, హరనాధ్ బాబు, జయవేణి, సంపూర్ణేష్ బాబు, శ్రీలక్ష్మీ, స్వప్నమాధురి తదితరులు ఉన్నారు. తొలుత ప్రకాష్ రాజ్ ప్యానల్ వైపు ఉన్న బండ్ల గణేష్ తర్వాత జీవితకు వ్యతిరేకంగా ప్రధాన కార్యదర్శిగా ఇండిపెండెంట్ గా పోటీచేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.