మా ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 10న‌

Update: 2021-08-25 12:59 GMT

టాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు షెడ్యూల్ విడుద‌లైంది. అక్టోబర్ 10న ఎన్నిక జ‌ర‌గ‌నుంది. 2021-2023 సంవ‌త్స‌రాల‌కు గాను నూత‌న ఎగ్జిక్యూటివ్ క‌మిటీని ఎన్నుకోనున్న‌ట్లు మా ప్రెసిడెంట్ వి కె న‌రేష్ పేరుతో ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల అయింది. గ‌తానికి భిన్నంగా ఈ సారి మా ఎన్నిక‌ల్లో ప‌లువురు బ‌రిలో నిలుస్తున్నారు. సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ తోపాటు మంచు విష్ణు, సీవీఎల్ న‌రసింహ‌రావు, హేమ తదిత‌రులు తాము బ‌రిలో ఉండ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ప్ర‌కాష్ రాజ్ అయితే త‌న ప్యాన‌ల్ మొత్తాన్ని ప్ర‌క‌టించారు. మిగిలిన వారు ఇంకా పూర్తి స్థాయి ప్యాన‌ల్స్ ను ప్ర‌క‌టించాల్సి ఉంది.

సీనియ‌ర్ న‌టుల ఆరోగ్యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఎన్నిక సంద‌ర్భంగా కోవిడ్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఎన్నిక తేదీ వెల్ల‌డి కావ‌టంతో టాలీవుడ్ లో రాజ‌కీయం ఇక ఊపందుకోనుంది. ఇప్ప‌టికే ప్ర‌కాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ మ‌ద్ద‌తుగా నిలుస్తోంది.మ‌రి ఇప్పుడు మంచు విష్ణు ప‌క్క‌న ఎవ‌రు ఉండ‌బోతున్నారు..న‌రసింహ‌రావు, హేమాల‌కు ఎవ‌రి మ‌ద్ద‌తు ల‌భిస్తుంది అన్న‌ది వేచిచూడాల్సిందే. ఇటీవ‌ల వ‌ర్చువ‌ల్ గా జ‌రిగిన మా స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఎన్నిక‌ల అంశంపై చ‌ర్చించారు. ఈ సారి మా ఎన్నిక‌లు సొంత భ‌వ‌న‌మే ప్ర‌ధాన ఏజెండాగా సాగ‌నున్నాయి. మ‌రి మా స‌భ్యులు ఎవ‌రి ప‌క్క నిల‌బ‌డతారో అక్టోబ‌ర్ 10వ తేదీనే వెల్ల‌డికానున్నాయి.


Tags:    

Similar News