అక్కడ ఉన్న ఓట్లు మొత్తం వెయ్యి లోపే. కానీ ఈ ఎన్నికలకు..ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా కవరేజ్ మాత్రం అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ఉంది. పోనీ టాప్ హీరోలు ఎవరైనా బరిలో నిలిచారా?. అంటే అదీలేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోలుగా ఉన్న వారు అసలు ఓటింగ్ కు వస్తారో రారో కూడా తెలియదు. గతంలో జరిగిన ఎన్నికలకు కీలక హీరోలు ఎవరూ అసలు ఓట్లు కూడా వేసిన దాఖలాలు లేవు. రకరకాల కారణాలు చెప్పి ఆ సమయానికి గాయబ్ అయ్యే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో తెరపైన కన్పించే రాజకీయాల కంటే తెరవెనక జరిగే రాజకీయాలు ఎక్కువ కాబట్టి. ఎందుకొచ్చిన రచ్చ అంటూ అసలు ఓటింగ్ కే దూరం ఉంటే ఎవరూ ఏమీ అనటానికి ఉండదు కదా అన్న ఆలోచన. పోనీ ఓటింగ్ రాని వారిని మా గట్టిగా ఏమైనా అంటుందా అంటే...అంత ధైర్యం అక్కడ ఎవరికి ఉంటుంది?. మీడియా కవరేజ్ విషయంలోనే కాదు..ఎన్నికల విషయంలోనూ అసలు సిసలు రాజకీయాలను తలపించేలా కొత్త అంశాలు మంగళవారం నాడు వెలుగులోకి వచ్చాయి.
మంచు విష్ణు ప్యానల్ 60 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అక్రమం వేయించింది అన్నది ప్రకాష్ రాజ్ ప్యానల్ ఆరోపణ. ఈ అంశంపై ఆయన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయటంతోపాటు..దీనికి సంబంధించి చేసిన చెల్లింపుల వివరాలను కూడా మీడియాకు చూపించారు. అంతే కాదు..ఈ పోస్టల్ బ్యాలెట్ల మోసంపై చిరంజీవి, నాగార్జున, మురళీమోహన్ లు స్పందించాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. గెలిస్తే మీరేమి చేస్తారో చెప్పి ఓట్లు అడగలేరా?. ఇలా దొంగ ఓట్లు వేయించుకునేలా అయితే అసలు ఎన్నికలు ఎందుకు అంటూ ప్రకాష్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మసకబారింది..చెడిపోయింది అంటే ఇలాంటి రాజకీయాలు జరిగాలా మ అసోసియేషన్ లో అంటూ మండిపడ్డారు ప్రకాష్ రాజ్. ఓ వైపు మంచు విష్ణు సీనియర్లు అందరినీ కలసి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతుంటే..ప్రకాష్ రాజ్ మాత్రం తనకు పెద్దల మద్దతు అవసరం లేదని..అవసరం అయితే ఆ పెద్దలను కూడా ప్రశ్నించటానికే మా బరిలో నిలిచానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.