వరుణ్ తేజ్..రితికా నాయక్ ల మూవీ హిట్ కొట్టిందా?!(Korean Kanakaraju Review)
వరుణ్ తేజ్..రితికా నాయక్ జంటగా నటించిన మూవీ కొరియన్ కనకరాజ్. దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ మూవీ పై ఫస్ట్ నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. కమెడియన్ సత్య చేసిన ప్రమోషన్ కూడా ఇందుకే బాగానే ఉపకరించింది. మరో వైపు ఈ సినిమా హిట్ కావటం అటు హీరో వరుణ్ తేజ్ తో పాటు దర్శకుడు మేర్లపాక గాంధీ కి కూడా ఎంతో కీలకం. ఎందుకంటే వరుణ్ తేజ్ గత సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈ సినిమా పై ఈ మెగా హీరో భారీ ఆశలే పెట్టుకున్నాడు. సినిమా విడుదల శుక్రవారమే అయినా...హైదరాబాద్ తో పాటు పలు చోట ఈ మూవీ ప్రీమియర్ షోస్ వేశారు. కథపై నమ్మకంతోనే చిత్ర యూనిట్ భారీగానే ప్రీమియర్ షోస్ వేసింది. ఒక సింపుల్ కథనే ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విజయవంతం అయ్యారు.
హీరో వరుణ్ తేజ్ అనంతపురం జిల్లా పెనుకొండ లో ఉంటూ తన స్నేహితులతో కలిసి చెక్క భజనలు చేస్తూ డబ్బు సంపాదిస్తాడు. దీంతో పాటు స్థానికంగా ఉండే వాళ్ళతో నిత్యం గొడవలు పడుతుంటాడు. దీనికి ప్రధాన కారణం తండ్రి చేసిన అప్పు. ఎక్కడో అనంతపురం జిల్లాలోని పెనుగొండలో ఉండే హీరో శరీరంలోకీ కొరియాకు చెందిన గ్యాంగ్ స్టర్ ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కథ ఎన్ని మలుపులు తిరిగిందే అన్నదే కొరియన్ కనకరాజు మూవీ. కొరియన్ గ్యాంగ్ స్టర్ ఆత్మ కనకరాజు శరీరంలో ప్రవేశించటానికి సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు బాగానే కనెక్ట్ చేశాడు. హీరోయిన్ రితికా నాయక్ విషయానికి వస్తే పెనుగొండలో ఉంటూ కియా కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. కొరియా నేర్చుకుంటూ..ఎలాగైనా సరే కొరియా వెళ్లి వీలు అయితే కొరియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవటమే తన లక్ష్యం అని చెపుతుంది. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ అంతా బలంగా లేకపోయినా ఒక ఫోటో స్టూడియో లో వీళ్ళిద్దరూ కలుసుకుంటారు..అక్కడ నుంచే ఆమెను ప్రేమలో దింపుతాడు. కొరియన్ కనకరాజు మూవీ ఫస్ట్ హాఫ్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్, సత్యాలు కలిసి చేసిన కామెడీ బాగా వర్క్ అయింది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఫస్ట్ హాఫ్ మూవీ సాగిపోతుంది.
కనకరాజు శరీరంలోకి ప్రవేశించిన కొరియన్ ఆత్మను వదిలించుకునేందుకు అందరూ కలిసి కొరియా వెళతారు. అక్కడ నుంచి సినిమా కాస్త స్లో అవుతుంది. అయినా సినిమాకు ప్రధాన బలం అయిన కామెడీ తోనే కథను నడిపిస్తారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సత్య, మురళీధర్ గౌడ్ వీడియో కాల్ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్విస్తాయి. కాకపోతే దర్శకుడు మేర్లపాకగాంధీ క్లైమాక్స్ లో ఏకంగా ఆత్మలతో భారీ ఫైట్ పెట్టి మరో పెద్ద కామెడీ చేశాడు అనే చెప్పొచ్చు. సినిమాలో ఎక్కువ కామెడీ తో నవ్వుకున్న ప్రేక్షకులు...క్లైమాక్స్ లో ఈ ఆత్మల ఫైట్ చూసి కూడా నవ్వుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగగా...సెకండ్ హాఫ్ లో మాత్రం దర్శకుడు సినిమా కథతోనే కామెడీ చేశాడు అనే ఫీలింగ్ వస్తుంది ప్రేక్షకులకు. కొరియన్ కనకరాజు మూవీని థమన్ తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో నిలబెట్టాడు అనే చెప్పాలి. హీరో వరుణ్ తేజ్ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా విజయంలో సత్య కీలక పాత్ర పోషించాడు. హీరోయిన్ రితికా నాయక్ కూడా ఆకట్టుకుంది. మొత్తం మీద కొరియన్ కనకరాజు మూవీ తో వరుణ్ తేజ్ తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాడనే చెప్పొచ్చు.
రేటింగ్ : 3 /5