ఆ జాబితాలో చేరిన నాగ్ అశ్విన్

Update: 2024-07-13 09:18 GMT

Full Viewదేశంలోనే తమ సినిమాలతో రెండు సార్లు వెయ్యి కోట్ల రూపాయల పైన గ్రాస్ వసూళ్లు సాధించిన హీరోలు ఇద్దరే ఇద్దరు. ఇందులో ఒకరు టాలీవుడ్ కు చెందిన పాన్ ఇండియా హీరో ప్రభాస్ అయితే...రెండవ హీరో బాలీవుడ్ కు చెందిన షా రుఖ్ ఖాన్. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే ఇప్పటి వరకు వెయ్యికోట్ల రూపాయల పైన గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాలు మొత్తం ఏడు ఉంటే ...అందులో ప్రభాస్ సినిమాలు రెండు ఉన్నాయి. ఒకటి బాహుబలి 2 అయితే...రెండవ సినిమా కల్కి 2898 ఏడి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే వెయ్యి కోట్ల రూపాయల పైబడి వసూళ్లు సాధించిన మొత్తం ఏడు సినిమాల్లో మూడు సినిమాలు తెలుగు దర్శకులు తెరకెక్కించినవే. ఇందులో రాజమౌళి ఖాతాలో రెండు ఉంటే..ఇప్పుడు కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ కూడా ఈ జాబితాలో చేరారు. బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా 1810 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధిస్తే...రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ 1387 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. కల్కి వసూళ్లు ఇప్పటికే 1006 కోట్ల రూపాయలకు చేరాయి. దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు 2 సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవటంతో కల్కి వసూళ్లు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.

                                                    ఇది ఇలా ఉంటే బాలీవుడ్ బాద్షా గా పేరున్న షారుఖ్ ఖాన్ ఒకే ఏడాది అంటే 2023 సంవత్సరంలోనే జవాన్, పఠాన్ సినిమాలతో వరసగా ఒక్కో సినిమాకు వెయ్యి కోట్ల రూపాయల పైనే గ్రాస్ వసూళ్లు సాధించి కొత్త రికార్డు నమోదు చేశాడు. అయితే ఇండియాలో తొలిసారి దంగల్ సినిమా 2024 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి కొత్త చరిత్ర లిఖించింది. మరో సినిమా కె జీఎఫ్ 2 1250 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పింది. టాలీవుడ్ విషయానికి వస్తే వెయ్యి కోట్ల రూపాయలు సాధించిన ఓన్లీ హీరో గా ప్రభాస్ నిలుస్తారు. టాలీవుడ్ కు చెందిన మరో దర్శకుడు వంగా సందీప్ రెడ్డి కొద్దిలో వెయ్యి కోట్ల రూపాయల వసూళ్ల టార్గెట్ మిస్ అయ్యారు. రణ్ బీర్ కపూర్ హీరోగా ఆయన తెరకెక్కించిన యానిమల్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 918 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. అయితే వంగా సందీప్ రెడ్డి ఇప్పుడు ప్రభాస్ హీరో గా స్పిరిట్ సినిమా ను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు నమోదు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి నుంచే ఈ సినిమా కు హైప్ అలా పెరుగుతూ పోతోంది. మరో వైపు ఎలాగూ ప్రభాస్ రికార్డులు ఉండనే ఉన్నాయి కదా మరి.

Tags:    

Similar News