ఫ్యామిలీ స్టార్ తోనూ నిరాశే!

Update: 2024-04-07 05:18 GMT

Full Viewటాలీవుడ్ హీరో విజయ దేవరకొండ కు కాలం కలిసి వస్తున్నట్లు లేదు. ఎందుకంటే ఆయనకు వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. విజయ్ నటించిన గత మూడు సినిమాలను చూస్తే లైగర్ దారుణమైన ఫెయిల్యూర్ ను చవి చూడగా ..తర్వాత వచ్చిన ఖుషి ఒక మోస్తరు గా ఆడింది తప్ప హిట్ టాక్ కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమా పరిస్థితి కూడా అదే. ఏ సినిమా సక్సెస్ అయినా తెలిసేది విడుదల వారంలో సోమవారం నాటి కలెక్షన్స్ బట్టే అంటారు. ఎందుకంటే రిలీజ్ అయిన మొదటి రోజు తో పాటు శనివారం, ఆదివారం నాడు పెద్ద హీరో లతో పాటు మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు కూడా కలెక్షన్స్ చాలా వరకు ఆశాజనకంగానే ఉంటాయి. అయితే అది టాక్ ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ సినిమా వసూళ్లు అయినా సోమవారం నాడు తొలి మూడు రోజుల ట్రెండ్ ను కొనసాగిస్తే సినిమా హిట్ కేటగిరీ లోకి వస్తుంది. దర్శకుడు పరశురామ్, విజయదేవరకొండ కాంబినేషన్ సినిమా కావటంతో ఫ్యామిలీ స్టార్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలం అయింది. దీంతో సినిమా వసూళ్లపై కూడా దెబ్బపడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

                                                             సోమవారం నాటి కలెక్షన్స్ సంగతి ఏమో కానీ...సెలవు రోజు అయిన...సినిమా విడుదల అయిన మూడవ రోజు అంటే ఆదివారం నాడు కూడా హైదరాబాద్ లోని మల్టీ ప్లెక్స్ థియేటర్లతో పాటు సింగల్ స్క్రీన్స్ లో కూడా సీట్లు అన్ని ఖాళీగా దర్శనం ఇస్తుండంతో ఫ్యామిలీ స్టార్ పరిస్థితి ఏందో అర్ధం అయిపోయింది. సినిమా లో హీరో విజయ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ల యాక్షన్ కు మంచి ప్రశంసలే దక్కినా కథలో దమ్ము లేకపోవటం, కథనం ఆసక్తికరంగా లేకపోవటంతో సినిమా ప్రేక్షుకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది అనే చెప్పాలి. క్లీన్ సినిమా కావటంతో ఫ్యామిలీ ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అవుతుంది అని ప్రచారం జరిగినా..ఆన్లైన్ బుకింగ్స్ చూస్తే అదేమీ ఉన్నట్లు కనిపించటం లేదు. దీంతో హీరో విజయదేవరకొండ కు వరసగా మూడవ సారి కూడా దెబ్బపడినట్లు అయింది అనే చర్చ సాగుతోంది.

Tags:    

Similar News