పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ఆయన మంగళవారం నాడు పుష్ప థ్యాంక్స్ మీటింగ్ లో ఈ సినిమాకు సంబంధించి తన అనుభవాలను పంచుకున్నారు. ప్రముఖ రచయిత చంద్రబోస్ రాసిన ఊ..అంటావా...ఊహూ అంటావా పాట సినిమాలో పెద్ద సంచలన విజయం సాధించింది. ఈ ప్రత్యేక గీతంలో సమంత నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాటకు సంబంధించి సుకుమార్ చాలా విషయాలు వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం చంద్ర బోస్ తనకు ఊ అంటావా..ఉహూ..అంటావా పాట చెప్పారని...తానే అప్పుడే ఈ పాటను ఉంచాలని కోరినట్లు తెలిపారు. మన కోసం ఉంచమని చెప్పాను. నాలుగు సంవత్సరాల నుంచి ఆయన పాట ఎవరికీ ఇవ్వకుండా అలాగే ఉంచారన్నారు. ఈ రోజు ప్రపంచం అంతా ఊ అంటావా...ఉహు అంటావా అంటూనే ఉందన్నారు. చంద్రబోస్ స్పాంటేనియటికి, అక్షర జ్ణానానికి ఖచ్చితంగా ఈ సందర్బంగా సీతారామశాస్త్రిని తలచుకోవాలన్నారు. తాను, దేవిశ్రీ ప్రసాద్, చంద్రబోస్ కూర్చుంటే ఎంతో ఎంజాయ్ చేస్తామని..తాము ఏదైనా విషయం చెపితే చంద్రబోస్ తమకు ఎన్నో ఆప్షన్లు ఇస్తారన్నారు. ఈ సందర్భంగా వేదికపైకి పిలిచి మరీ చంద్రబోస్ కు పాదాబివందనం చేశారు సుకుమార్. చూడటానికి అత్యంత సాదాసీదా వ్యక్తిలాగా కన్పించే చంద్రబోస్ ప్రతిభ, శక్తి ఏంటో తనకు తెలుసని..అది చెప్పటానికే ఆయన కాళ్లకు నమస్కారం చేసినట్లు ప్రకటించారు.
ఆ సమయంలో తనకు ఎప్పుడూ సినిమా జర్నీ అందంగా ఉండదన్నారు. ప్రతి సినిమా చాలా బాధపడుతూ చేస్తానని. రిజల్ట్స్ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ అని పేర్కొన్నారు. నాకు సక్సెస్ కావాలి. నేను తీసే సినిమా హిట్ కావాల్సిందే అని వ్యాఖ్యానించారు. హీరో అల్లు అర్జున్ కూడా సుకుమార్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. తాను ఎవరికైనా రుణ పడి ఉన్నాను అనే మాట చెప్పాలంటే తన తల్లిదండ్రులు..తాత అల్లు రామలింగయ్య, చిరంజీవి తర్వాత సుకుమారే అన్నారు. ఆర్య సినిమా తర్వాత తాను ఓ 80 లక్షల రూపాయలతో స్పోర్ట్స్ కారు కొనుగోలు చేశానని..దాని స్టీరింగ్ పట్టుకుని దీనికి కారణమైన వారు ఎవరెవరు అని తలచుకున్నానని..అందులో సుకుమార్ ఒకరు అని వెల్లడించారు. పుష్ప చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు.