గత కొంత కాలంగా దక్షిణాది సినిమాలు జాతీయ స్థాయిలో దుమ్ము రేపుతుంటే ... బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. ఇదే విషయాన్నీ బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కూడా బహిరంగంగా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ధురంధర్ సినిమా కొత్త జోష్ తీసుకువచ్చింది. ఎంతో కాలంగా వస్తున్న విమర్శలకు సమాధానం చెపుతూ ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన దురంధర్ మూవీ మూవీ ఎన్నో రికార్డులు నమోదు చేసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకోవటమే కాకుండా..వసూళ్ల పరంగా కూడా ఏకంగా 1400 కోట్ల రూపాయలు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణవీర్ సింగ్ తో పాటు ఇందులో విలన్ గా నటించిన అక్షయ్ ఖన్నా యాక్షన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ధురంధర్ కు నాల్గవ స్థానం దక్కింది.