సత్తా చాటిన ఎన్టీఆర్

Update: 2024-09-28 05:24 GMT

Full Viewఎన్టీఆర్ హీరో గా నటించిన దేవర సినిమా వసూళ్ల విషయంలో దుమ్మురేపింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల వాటానే 68 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం మీద అన్ని భాషల్లో కలుపుకుని దేశంలో వచ్చిన కలెక్షన్స్ 77 కోట్ల రూపాయలుగా చెపుతున్నారు. అమెరికాలో దేవర సినిమా ప్రీ రిలీజ్ సేల్స్ విషయంలోనే రికార్డు లు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ దేవర తొలిరోజు వసూళ్లు ఆశాజనకంగానే ఉన్నాయని చెప్పొచ్చు. వీకెండ్ తో పాటు దసరా సెలవుల్లో ఇతర పెద్ద సినిమాలు ఏమీ లేకపోవటం కూడా దేవర కలెక్షన్ల కు సానుకూల అంశంగా భావిస్తున్నారు. అమెరికా లో ఇప్పటికే దేవర వసూళ్లు 3 . 5 మిలియన్ డాలర్స్ ను అధిగమించాయి. దేవర సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించటంపై పెద్ద ఎత్తున హైప్ ఏర్పడినా కూడా ఇందులో ఆమె పాత్ర పరిమితంగానే ఉంది.

                                                                  ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించిన సంగతి తెలిసిందే. దేవర విడుదల సందర్భంగా ఎన్టీఆర్ తన అభిమానులనుద్దేశించి ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దేవర ను ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు తారక్. రాబోయే రోజుల్లో అటు ప్రేక్షకులు..ఇటు అభిమానులకు మరెంతో వినోదాన్ని అందిస్తానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ హిందీ మార్కెట్ పై ఫోకస్ పెట్టినా కూడా తొలి రోజు వసూళ్ల పరంగా చూస్తే అంత మెరుగ్గా లేవు అనే వార్తలు వస్తున్నాయి. ఈ వీకెండ్ పూర్తి అయ్యే నాటికి ముఖ్యంగా హిందీ బెల్ట్ లో పరిస్థితి ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. ఎందుకంటే ఎన్టీఆర్ మరో హీరో హృతిక్ రోషన్ తో కలిసి చేసిన వార్ 2 త్వరలో విడుదల కానుంది. హిందీ మార్కెట్ లో పట్టుపెంచుకోవటంతో పాటు వార్ 2 సినిమా సక్సెస్ కు కూడా హిందీ బెల్ట్ లో దేవర వసూళ్లు కీలకం అవుతాయి అనే టాక్ ఉంది.

Tags:    

Similar News