తిరుపతిలో చోటు చేసుకున్న దుర్ఘటనతో బాలకృష్ణ నటిస్తున్న డాకుమహారాజ్ సినిమా రిలీజ్ ఈవెంట్ రద్దు అయింది. షెడ్యూల్ ప్రకారం అయితే గురువారం సాయంత్రం ఇది అనంతపురం లో జరగాల్సి ఉంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా లో బాలకృష్ణ కు జోడిగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ద శ్రీనాథ్ లు నటించిన సంగతి తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించి అమెరికాలో ఒక ఈవెంట్ నిర్వహించారు. అనంతపురం లో గురువారం మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిధిగా రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు.
ఈ సినిమా జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తిరుమల లో వైకుంఠ ద్వార దర్శన టికెట్స్ కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ఈ తరుణంలో ఈవెంట్ నిర్వహించటం సరికాదు అని భావించి రద్దు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించింది.