శ్రీ విష్ణు సినిమాలు అంటే ఎక్కువ శాతం కామెడీ మూవీసే ఉంటాయి. శ్రీ విష్ణు హీరోగా నటించి ప్రేక్షకులను ఫుల్ గా నవ్వించిన మూవీ అంటే సామజవరగమనా అనే చెప్పాలి. దీని తర్వాత శ్రీ విష్ణు చాలా సినిమాలు చేసినా కూడా ఆ రేంజ్ లో ఒక్కటి కూడా ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయలేకపోయింది. శ్రీ విష్ణు, మహిమా నంబియార్ జంటగా నటించిన సినిమానే కామ్రేడ్ కళ్యాణ్. ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ టైటిల్ చూసిన తర్వాత కామెడీ చేసే శ్రీ విష్ణుతో కామ్రేడ్ కళ్యాణ్ ఏంటి?. మావోయిస్టు గా శ్రీ విష్ణు ఎలా చేస్తాడు అన్న సందేహాలు వస్తాయి ఎవరికైనా. పేరు ఏదైనా కూడా చిత్ర యూనిట్ ఇందులోనూ కామెడీనే టార్గెట్ గా చేసుకుని కథ నడిపించింది. ఇక సినిమా కథ విషయానికి వస్తే ఒక ఊరిలో థియేటర్ నడుపుతుంటాడు హీరో. హీరో తల్లి పాత్రలో నటించిన రాధిక బాలకృష్ణ వీరాభిమాని. రిలీజ్ అయిన ప్రతి బాలకృష్ణ చూస్తూ థియేటర్ దగ్గర ఎవరైనా బాలకృష్ణ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తే వాళ్లపై దాడి చేస్తూ ఉంటుంది. పోలీస్ కేసులు కావటం..కొడుకు వెళ్లి విడిపించుకురావటం.

                                             ఒక రోజు సడన్ గా థియేటర్ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో రాధిక సృహతప్పి పడిపోతుంది. అటు గా వస్తున్న హీరోయిన్ మహిమా నంబియార్ సీపీఆర్ చేసి రాధికను కాపాడుతుంది. అప్పటి నుంచి హీరో ఆ ఫ్యామిలీకి దగ్గర అవ్వాలని చూస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. హీరోయిన్ కుటుంబం ఆర్థిక సమస్యలు తీర్చేందుకు తన ఫ్రెండ్ సత్య చెప్పిన ఒక డీల్ కు ఒప్పుకుంటాడు. అదే హీరో జీవితాన్ని సమస్యల్లోకి నెడుతుంది. అసలు సత్య చెప్పిన ఆ డీల్ ఏంటి?. ఆ సమస్య నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అన్నదే కామ్రేడ్ కళ్యాణ్ మూవీ. ఈ మూవీ లో స్టోరీ 1994 నుంచి ప్రారంభం అయినట్లు చూపిస్తారు. అప్పటిలో రాష్ట్రంలో మావోయిస్టులు..పోలీసుల మధ్య జరిగే సంఘర్షణలను ఇందులో చూపించారు. వాటితో పాటు అక్కడక్కడా ఎమోషన్స్...కామెడీని కలగలిపి కామ్రేడ్ కళ్యాణ్ మూవీని నడిపించాడు దర్శకుడు జానకిరామ్ మారెళ్ల.

                                     నక్సలిజమ్ బ్యాగ్రౌండ్ స్టోరీ తో కథ రాసుకుని..టైటిల్ కూడా అదే పెట్టినా ఎక్కువ శాతం కామెడీ తోనే సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు. ఈ మూవీ లో శ్రీ విష్ణు తో పాటు సత్య కామెడీ పర్వాలేదు అనిపిస్తుంది. ఉపేంద్ర లిమాయే కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఈ మూవీ లో షైన్ టామ్ చాకో, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్ , బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. హీరో శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ గా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. శ్రీ విష్ణుకు థియేటర్ నడపటంలో సహకరించే పాత్రలో కనిపించిన సుదర్శన్ తో పాటు సత్య లు తమ వంతు కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా చూస్తే కామ్రేడ్ కళ్యాణ్ కాస్త కామెడీ కళ్యాణ్ గా మారతాడు. అది కూడా అంత పూర్తి స్థాయిలో ఉండదు. దీంతో ఇది ఒక టైం పాస్ మూవీగా మిగిలిపోతుంది.

Full View

Tags: