సినిమా విడుదల కు ముందు నుంచే రఫ్ఫాడిస్తాం...అదరగొడతాం అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి సందడి చేశారు. చెప్పినట్లే చిరంజీవి హీరోగా తెరకెక్కిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ టాక్ దక్కించుకున్నారు. ప్రీమియర్స్ దగ్గర నుంచి ఈ సినిమా కు మంచి స్పందన దక్కింది. దీంతో వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్స్ తో కలుపుకుని తోలి రోజు 84 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ వెల్లడించింది.
మెగా బ్లాక్ బస్టర్ అంటూ వసూళ్లతో కూడా పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాలో చిరంజీవి కి జోడిగా నయనతార నటిస్తే..మరో కీలక పాత్రలో వెంకటేష్ సందడి చేసిన సంగతి తెలిసిందే. గత సంక్రాంతికి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం తో సూపర్ హిట్ అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవికి కూడా సంక్రాంతికి మరో హిట్ అందించి రికార్డు నమోదు చేశాడు. చిత్ర యూనిట్ సినిమా ఫలితంపై ఫుల్ ఖుషీ గా ఉంది. అయితే ఇప్పుడు అందరి కళ్ళు ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే నాటికీ మొత్తం ఎన్ని వసూళ్లు సాధిస్తుంది అన్న దానిపైనే ఉంది.