బాక్స్ ఆఫీస్ దగ్గర చిరంజీవి మూవీ దూకుడు కొనసాగుతోంది. జనవరి 12 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మన శంకర వర ప్రసాద్ సినిమా వసూళ్ల పరంగా దుమ్మురేపుతోంది. తోలి రోజు ప్రీమియర్స్ తో కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా 84 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా రెండవ రోజు 36 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. రెండు రోజులు కలుపుకుని ఈ మూవీ ఏకంగా 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అభిమానులను ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల రూపాయల మార్క్ దాటడంపై దర్శకుడు అనిల్ రావిపూడి సంతోషం వ్యక్తం చేశారు. వరసగా వంద కోట్ల రూపాయల వసూళ్లు దాటిన తన ఆరవ సినిమా ఇది అన్నారు.
తనకు ఇంతకు మించిన సంక్రాంతి గిఫ్ట్ మరొకటి ఉండదు అని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో చిరంజీవి జోడిగా నయనతార నటిస్తే...మరో కీలక పాత్రలో వెంకటేష్ అదరగొట్టారు. భోగి రోజు అంటే జనవరి 14 న కూడా ఈ సినిమా బుకింగ్స్ ఫుల్ జోష్ లో ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో సినిమా వసూళ్లు మరింత పెరగటం ఖాయం అనే చెప్పొచ్చు. థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే నాటికీ ఈ సినిమా వసూళ్లు 400 నుంచి 500 కోట్ల రూపాయల వరకు చేరే అవకాశం ఉంది అని భావిస్తున్నట్లు నిర్మాత సాహు గారపాటి వెల్లడించారు. ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుండంతో ఈ మూవీని మరిన్ని థియేటర్ ల్లో ప్రదర్శించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్తగా థియేటర్ లు యాడ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఒక్క బుక్ మై షో లోనే ఈ సినిమా పదిహేను లక్షల టిక్కెట్లు అమ్మినట్లు తెలిపారు.