సంక్రాంతి బరి నుంచి ఓ పెద్ద సినిమా తప్పుకుంది. ఆర్ఆర్ఆర్..రాధేశ్యామ్ ల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు కలసి నటిస్తున్న సినిమా బీమ్లానాయక్. ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సినిమాలో కోసం బీమ్లానాయక్ విడుదల వాయిదా వేయాలని నిర్మాతల గిల్డ్ కోరింది. వీరి వినతిని హీరో పవన్ కళ్యాణ్ తోపాటు బీమ్లానాయక్ నిర్మాత రాధాక్రిష్ణ ఆమోదించారని నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆయన మంగళవారం నాడు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు.
బీమ్లానాయక్ కూడా సంక్రాంతికే విడుదల అయితే థియేటర్ల సర్దుబాటు కష్టం అవుతుందని అన్నారు. కరోనా కారణంగా పరిశ్రమ ఇప్పుడిప్పుడే గాడినపడుతుందని..అదే సమయంలో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ల షూటింగ్ లు ప్రారంభం అయి కూడా చాలా కాలం అయినందున అందరం చర్చించుకుని ఈ సర్దుబాటుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఫిబ్రవరిలో బీమ్లానాయక్ విడుదల ఉంటుందని..వాస్తవానికి తమ ఎఫ్ 3 విడుదలకు పెట్టుకున్న స్లాట్ ను బీమ్లానాయక్ కు కేటాయిస్తున్నట్లు దిల్ రాజు తెలిపారు. బీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని తెలపారు.