ఆ సినిమా పేరులోనే బంగారం ఉంది. పైగా సంక్రాంతి పోటీలో మరో పెద్ద సినిమా లేదు. కరోనా ఆంక్షలు ఉన్నా తెలుగు ప్రేక్షకులకు అసలైన పండగ అంటే సినిమా చూడటమే. పండగ రోజు సినిమా చూడటం ఓ ప్రత్యేకత. అక్కినేని నాగార్జున, రమ్యక్రిష్ణ, నాగచైతన్య, కృతిశెట్టిలు జంటగానటించిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో తొలి రోజు నుంచి భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. స్వయంగా నాగార్జున తమ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయని..తాము ఫుల్ హ్యాపీ అని మీడియా సమావేశంలో ప్రకటించారు.
తాజాగా చిత్ర యూనిట్ రెండు రోజుల్లో 36 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళు సాధించినట్లు కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. పండగకు విడుదలైన ఏకైక పెద్ద సినిమా కావటంతో పాటు సంక్రాంతికి పూర్తిగా కనెక్ట్ అయ్యేలా గ్రామీణ ఆధారిత చిత్రం కావడం 'బంగార్రాజు'కు బాగా కలిసొచ్చింది. దీంతోపాటు సోగ్గాడే చిన్నినాయనాకు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. దీంతో తొలి భాగం చూసిన వారంతా బంగార్రాజు సినిమా చూడటానికి ఆసక్తి చూపించటం కూడా కలిసొస్తుంది.