అఖండ 2 ప్రీమియర్ షోస్ రద్దు

Update: 2025-12-04 14:32 GMT

బాలకృష్ణ ఫ్యాన్స్ కు బిగ్ షాక్. భారీ అంచనాలు ఉన్న అఖండ 2 సినిమా ప్రీమియర్ షోస్ రద్దు అయ్యాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ లో కూడా స్పెషల్ షో లు ఉండవు అని చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ లో ప్రీమియర్ షోస్ తో పాటు రెగ్యులర్ షోస్ టికెట్స్ బుకింగ్ ఓపెన్ కాలేదు. దీనికి ప్రధాన కారణం మద్రాస్ హై కోర్టు ఈ సినిమా విడుదల పై స్టే విధించటమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షో ల కోసం ఆరు వందల రూపాయల రేట్లు తెచ్చుకున్నా కూడా ఇప్పుడు రద్దు అయ్యాయి. అఖండ 2 తాండవం' సినిమా విడుదల ఆపాలంటూ ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తమకు రూ. 28 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ పేరుతో సినిమాలు నిర్మిస్తున్నారని, తమకు రావాల్సిన డబ్బులు చెల్లించేంత వరకు 'అఖండ 2' సినిమా రిలీజ్ నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేసింది.

                                     దీన్ని పరిశీలించిన న్యాయస్థానం.. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 'అఖండ 2' విడుదల ఆపాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే రెండు నిర్మాణ సంస్థలు సమస్యను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరుపుతున్నాయి. స్పెషల్ షోస్ లేకపోయినా శుక్రవారం విడుదల వీలుగుగా సమస్య పరిష్కారం అవ్వటానికి ఎక్కువ ఛాన్సులు ఉన్నట్లు ఈ వ్యవహారాన్ని చూస్తున్న వ్యక్తులు చెపుతున్నారు. అఖండ 2 తాండవం బాలకృష్ణ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. దీనికి అడ్డంకులు ఎదురుకావడం ఆయన ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేసింది అనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న నాలుగో సినిమా ఇది. అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపటంతో అఖండ 2 తాండవం పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

                                         ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ గతంలో 14 రీల్స్ తో కలిసి '1 నేనొక్కడినే', 'ఆగడు' చిత్రాలను నిర్మించింది. రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర ఈ సినిమాలకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఇవి రెండూ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయాలను అందుకోలేదు. ఆ తర్వాత రామ్ ఆచంట, గోపీ ఆచంట సపరేట్ గా '14 రీల్స్ ప్లస్' అనే మరో ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి, మూవీస్ తీస్తున్నారు. ఇప్పుడు 'అఖండ 2' చిత్రాన్ని ఈ బ్యానర్ లోనే రూపొందించారు. అయితే గతంలో '14 రీల్స్'లో తీసిన సినిమాలకు సంబంధించి రూ.28 కోట్ల వరకూ నిర్మాతలు తమకు బాకీ ఉన్నారని ఈరోస్ సంస్థ ఆరోపిస్తోంది. గురువారం రాత్రికి ఈ విషయం సెటిల్ అవ్వటానికి..శుక్రవారం నాడు సినిమా విడుదలకు ఎక్కువ ఛాన్సులు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెపుతున్నాయి.

Tags:    

Similar News