ప్రభాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్. తెలంగాణ ప్రభుత్వం రాజాసాబ్ సినిమా ప్రీమియర్స్ కు అనుమతి మంజూరు చేయలేదు. అదే సమయంలో రేట్ల పెంపునకు కూడా నో చెప్పింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు అంతా నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ లో కూడా ప్రీమియర్స్ ఉంటాయని భావించారు. తెలంగాణ తప్ప పలు ఇతర రాష్ట్రాల్లో కూడా రాజాసాబ్ ప్రీమియర్స్ కు అనుమతి వచ్చింది. కాకపోతే రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో పాత రేట్ల ప్రకారమే మీడియా తో పాటు ఎంపిక చేసిన థియేటర్ల లో ప్రీమియర్స్ వేయటానికి రంగం సిద్ధం చేశారు. ఈ సంక్రాంతి సీజన్ లో ఫస్ట్ ప్రభాస్ సినిమా జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఒక రోజు ముందుగానే అంటే జనవరి ఎనిమిది రాత్రి ప్రీమియర్స్ వేయటానికి చిత్ర యూనిట్ రెడీ అయింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. కానీ ఫలితం దక్కలేదు. రాజాసాబ్ చిత్ర యూనిట్ తో పాటు చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు యూనిట్ లు రెండూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవటంతో పాటు టికెట్ రేట్ల పెంపు...ప్రీమియర్స్ విషయంలో సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని కోర్టు ని ఆశ్రయించాయి.
అయితే కోర్ట్ ఈ ఆదేశాలు గత సినిమాలు అయిన పుష్ప 2 , ఓజీ, అఖండ 2 లకు మాత్రమే వర్తిస్తాయని..ప్రభుత్వం ఈ దరఖాస్తుల విషయంలో నిర్ణయం తీసుకోమని బంతిని ప్రభుత్వ కోర్టు లోకి నెట్టింది. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పాత రేట్ల ప్రకారం చివరి నిమిషంలో ప్రీమియర్స్ కు చిత్ర యూనిట్ సిద్ధం అయింది. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. జనవరి 8న ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ.1,000గా నిర్ణయించారు. ఈ స్పెషల్ షో ని గురువారం సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా ప్రదర్శించటానికి అనుమతి ఇచ్చారు. అదే సమయంలో జనవరి 9 నుంచి10 రోజుల వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరపై రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 పెంచుకోవదానికి కూడా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.