నందమూరి ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీల మధ్య ఉన్న అనుబంధం ఏనాటితో అని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం నాడు అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్ ఎన్టీఆర్, అల్లూరి రామలింగయ్య కాలం నుంచి ఉన్న సంబంధాలను ప్రస్తావించారు. నందమూరి బాలకృష్ణ రియల్ లో ఉన్నా..రీల్ లో ఉన్నా ఒకేలా ఉంటారన్నారు. కోపం ఉంటే కోపంలా..ఆనందంలో ఉంటే ఆనందమే చూపిస్తారన్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత బాగా డైలాగ్ లు డిక్షన్ తో చెప్పగలితే వ్యక్తి బాలకృష్ణ అని వ్యాఖ్యానించారు.
రెండు పేజీల డైలాగ్ లు అయినా బాలకృష్ణ అలవోకగా చెప్పగలరన్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్నారు. కరోనా కారణంగా పెద్ద సినిమాలకు చాలా కష్టాలు వచ్చాయన్నారు. సెకండ్ వేవ్ ద్వారా వస్తున్న పెద్ద సినిమా ఇదేనన్నారు. ఇది అఖండ జ్యోతిలాగా అందరికీ వెలుగు ఇవ్వాలన్నారు. తన ప్రసంగం చివరిలో అల్లు అర్జున్ జై బాలయ్య అంటూ ముగించారు.