అల్లు అర్జున్ కు మానవత్వం సడన్ గా ఎందుకు పెరిగిపోయింది. డిసెంబర్ 4 రాత్రి సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మరణించిన తర్వాత ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేసి బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం అందిస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ సాయం కోటి రూపాయలకు పెరిగింది. అంటే సడన్ గా అల్లు అర్జున్ కు ఇప్పుడే మానవత్వం ఎందుకు పెరిగిపోయింది. అధికారికంగా ఆయన చేస్తానన్న సాయం 25 లక్షలు. కానీ సంధ్య థియేటర్ ఘటన విషయంలో పోలీస్ కేసు, అరెస్ట్, జైలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలతో సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ తన వంతుగా రేవతి కుటుంబానికి కోటి రూపాయల సాయం అందించారు.
ఒక దుర్ఘటన జరిగినప్పుడు తొలుత స్పందించేదే అసలైన స్పందన. కానీ ఇప్పుడు ఆయన కోటి రూపాయలు ఇచ్చినా కూడా అల్లు అర్జున్ పై పడిన ముద్ర ఏ మాత్రం మారదు అనే చెప్పాలి. కేవలం ఇది ఒత్తిడితో...కేసు లతో ...మీడియా లో వచ్చే విమర్శలు తట్టుకోలేకే సాయం మొత్తం పెంచినట్లు ప్రతి ఒక్కరూ భావిస్తారు. రేవతి కుటుంబానికి మొత్తం రెండు కోట్ల రుపాయల సాయాన్ని బుధవారం నాడు దిల్ రాజు, అల్లు అరవింద్ లు అందచేశారు. ఇందులో అల్లు అర్జున్ సాయం కోటి రూపాయలు అయితే...దర్శకుడు సుకుమార్ 50 లక్షల రూపాయలు, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు ఇచ్చారు. ఇది అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ స్పందన తర్వాత జరిగిన పరిణామాలు కావటం విశేషం. గురువారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు భేటీ కాబోతున్నారు. దాని కంటే ముందుగానే శ్రీ తేజ్ ఫ్యామిలీ కి సాయం చెక్ లు అందచేశారు.