పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యూనరేషన్ మూడు వందల కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం ఫోర్బ్స్ వెల్లడించింది. దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా కూడా అందులో ప్రకటించారు. ఇందులో నిజం లేదు అని అల్లు అర్జున్ కానీ..ఆయన టీం కానీ ఇప్పటి వరకూ ఎక్కడా స్పందించినట్లు అయితే లేదు. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా డిసెంబర్ 20 న తన సోషల్ మీడియా పేజీ లో ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1508 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ప్రకటించింది. ఒక్క సినిమా కు మూడు వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడు ఒక మనిషి ప్రాణానికి కట్టిన విలువ 25 లక్షల రూపాయలు . ఆమె కుటుంబానికి తాను ఈ మేరకు సాయం చేస్తానని అల్లు అర్జున్ఒ క వీడియో ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో జరిగిన విషాదకర ఘటనలో అల్లు అర్జున్ అభిమాని అయిన రేవతి అనే మహిళా తొక్కిసలాటలో చనిపోగా..ఆమె కొడుకు శ్రీ తేజ్ ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఎప్పుడు తిరిగి సాధారణ స్థితికి చేరుకుని బయటకు వస్తాడో ఇంకా స్పష్టత లేదు. ఇదే కేసు లో పోలీస్ లు అల్లు అర్జున్ ను అరెస్ట్ తర్వాత ఒక్క సారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ఈ ఘటనపై ప్రకటన చేసిన తర్వాత ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ తనతో పాటు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, డైరెక్టర్ అందరం కలిసి ఒక ఫండ్ లాగా ఆ ఫ్యామిలీ కి పెద్ద అమౌంట్ ఫిక్సడ్ గా చేద్దాం అనుకున్నట్లు మీడియా సాక్షిగా చెప్పాడు. ఇది అంతా అరెస్ట్ అయిన తర్వాత చెప్పిన మాట. ముందు మాత్రం 25 లక్షల సాయం ప్రకటించి వదిలేశారు. నిజంగా తన అభిమానులు అయిన కుటుంభానికి చిత్తశుద్ధితో సాయం చేయాలని ఉంటె అల్లు అర్జున్ ఇదే మాట ముందు తన వీడియో లోనే చెప్పి ఉండాలి కదా. అందరం కలిసి ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని. కానీ అలా చెప్పలేదు. కానీ ఘటన జరిగిన ఇన్ని రోజుల తర్వాత చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సోమవారం నాడు రేవతి కుటుంబ సభ్యలకు 50 లక్షల రూపాయల చెక్ అందచేసింది. ఇది అంతా చూస్తుంటే ఒక సినిమాతో వందల కోట్ల రూపాయలు సంపాదించి కూడా బాధిత మహిళా కుటుంబానికి సాయం విషయంలో ఇన్ని డ్రామాలు అవసరమా అన్న అనుమానాలు ఎవరికైనా రావటం సహజం. అల్లు అర్జున్ ఒక వైపు అంతా కలిసి ఒక పెద్ద అమౌంట్ అంటే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ విడిగా 50 లక్షల చెక్ అందచేసింది.