పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా ఆదిపురుష్ ప్రమోషన్స్ కోసం మరీ ఇంత కష్టపడాలా?. ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అది ఏంటి అంటే ఆదిపురుష్ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్ లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు కేటాయిస్తారట. ‘రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటకి హనుమంతుడు వస్తారు అన్నది మన నమ్మకం ..ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రతి థియేటర్ లో ఒక సీటు అమ్మకుండా ఉంచాలని నిర్ణయించాం. అతి గొప్ప రామభక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనివిని విధంగా ఈ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాం. భారీ హంగులతో నిర్మించిన ఆదిపురుష్ సినిమాను హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం’ అంటూ చిత్ర యూనిట్ ఒక పోస్ట్ పెట్టగా ఇప్పుడు ఇది పెద్ద చర్చనీయాంశగా మారింది. అసలు ఒక వాణిజ్య సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా హనుమంతుడికి సీటు కేటాయించాము...అందరం చూద్దాం అంటూ ప్రమోషన్స్ చేయటం ఏమిటో అంటూ కొంత మంది నెటిజన్స్ తప్పు పడుతున్నారు. అసలు ఈ సినిమాలో హునుమంతుడిని చూపించిన విధానంపై కూడా విమర్శలు ఉన్నాయి. ఆదిపురుష్ సినిమా విజయం ప్రభాస్ కెరీర్ కు ఎంతో కీలకం. ఎందుకంటే బాహుబలి రెండు భాగాల తర్వాత అయన చేసిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూశాయి.
అందుకే ఇప్పుడు ఆదిపురుష్ సినిమా విజయం అయన కు..తదుపరి సినిమా ల మార్కెట్ కు దారి చూపించాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ నానా తంటాలు పడుతోంది. వాస్తవానికి ఆదిపురుష్ టీజర్ పెద్ద బ్యాక్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే సినిమాలో మార్పులు చేసిన మరీ ఇప్పుడు జూన్ 16 న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మంగళవారం నాడు తిరుపతి లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనికి ముఖ్య అతిధిగా చినజీయర్ స్వామి హాజరు కానున్నారు. ఎంత చేసిన కూడా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సినిమా బాగుంటే ఆడుతుంది....అదే ఉత్తరాదిలో అయితే ఈ సినిమాను బీజేపీ ప్రోమోట్ చేస్తుంది అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఉంది. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ సాలార్, ప్రాజెక్ట్ కె సినిమా లు విడుదల కావాల్సి ఉంది. హీరో ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు మంగళవారం నాడు తిరుమల లో స్వామివారి దర్శనం చేసుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రెడీ అవుతున్నారు.