గుట్కా వ్యాపారం. ఆ డబ్బుతో సినిమాలు. సొంత నిర్మాణ సంస్థతో..తానే హీరోగా నటించిన సచిన్ జోషి. తీసిన సినిమాలు అన్నీ ఫట్ మనటంతో మళ్లీ అటువైపు చూడని వ్యవహారం. మధ్యలో సినీ పరిశ్రమలోని వ్యక్తులతో వివాదాలు...గొడవలు. ఇప్పుడు గుట్కా అక్రమ రవాణా కేసులో అరెస్ట్. పాన్ మసాలల ముసుగులో నిషేదిత గుట్కాలు తయారు చేస్తూ..సరఫరా చేస్తున్నారనే అభియోగాలపై సచిన్ జోషిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను ముంబయ్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ముంబయ్ కు వచ్చిన సచిన్ జోషిని నిర్బంధంలోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌కు అక్రమంగా గుట్కా తరలింపులో సచిన్ జోషి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 273,336 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్‌లో భారీగా గుట్కా అక్రమ రవాణాని పోలీసులు పట్టుకున్నారు. పెద్ద మొత్తంలో గుట్కా బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గుట్కా కోట్ల రూపాయల్లో ఉంటుందని సమాచారం. ఈ కేసులో నిందితుల విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విచారణలో సచిన్ జోషి పేరు బయటకు రావడంతో ఆయనపై బహదూర్ పురా పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 336, 273 కింద కేసు నమోదు అయింది. అప్పటి నుంచి సచిన్ జోషి విదేశాల్లో ఉండటంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ నుంచి ముంబయ్ కి రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు.