అటల్ టన్నెల్ ను ప్రారంభించిన మోడీ

Update: 2020-10-03 08:38 GMT

ప్రధాని నరేంద్రమోడీ శనివారం నాడు హిమాచల్ ప్రదేశ్ లో ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ టన్నెల్ ను జాతికి అంకితం చేశారు. ఇది ఎంతో చారిత్రాత్మక రోజు అని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతే కాదు..మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి కలని సాకారం చేసిన రోజు అని పేర్కొన్నారు ఈ సొరంగ మార్గం భారత సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. దాదాపు రూ.3,500 కోట్ల వ్యయంతో ఆస్ట్రియా టన్నెలింగ్‌ విధానంలో దీన్ని నిర్మించారు. 9.02 కిలోమీటర్ల అతి పొడవున నిర్మించిన ఈ టన్నెల్‌ సముద్ర మట్టానికి పది వేల అడుగులు ఎత్తులో గుర్ర‌పు షూ ఆకారంలో నిర్మించారు. ఈ ట‌న్నెల్ ద్వారా మనాలీ నుంచి లద్దాఖ్‌లోని లేహ్‌ వరకు దాదాపు 5 గంట‌ల ప్ర‌యాణ స‌మయం త‌గ్గుతుంది.

మనాలీ నుంచి లాహాల్-స్పితి లోయతో అనుసంధానించి నిర్మించిన ఈ సొరంగ మార్గం వ‌ల్ల శీతాకాలంతో పాటు అన్ని కాలాల్లో ఏడాది పొడవునా ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు క‌ల్పించిన‌ట్లు అయింది. రోజుకు 3,000 కార్లు, 1,500 ట్రక్కులు ఈ ట‌న్నెల్ గుండా ప్ర‌యాణించివ‌చ్చు. ప్ర‌తీ వాహ‌నం గ‌రిష్టంగా 80 కిలోమీట‌ర్ల వేగంతో ప్ర‌యాణించ‌వ‌చ్చ‌ని అధికారులు వెల్ల‌డించారు. కీలకమైన పాక్‌, చైనా సరిహద్దులో సియాచిన్‌ గ్లేసియర్‌, అక్సాయ్‌ చిన్‌లలో మన సైనికులు నిరంతర పహరా కాస్తున్నారు. వారికి ఆహార పదార్థాలను, ఆయుధాలను, ఇతర సామగ్రిని తీసుకెళ్లడం చాలా క‌ష్ట‌త‌రంగా ఉండేది. ఈ నేప‌థ్యంలో రోహతాంగ్‌ పాస్‌ కింద సొరంగం నిర్మించాలని అప్ప‌టి ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి నిర్ణ‌యించారు.

Similar News