టీఆర్ పీ స్కామ్ పై శివసేన స్పందించింది. త్వరలోనే దీనికి సంబంధించి అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆ పార్టీ కీలకనేత, ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. ముంబయ్ పోలీసులు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఇది ఆరంభం మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఇది 30 వేల కోట్ల రూపాయల కుంభకోణం అన్నారు. దీని వెనక ఎవరు ఉన్నారు..ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయని అని ప్రశ్నించారు. ముంబయ్ పోలీసులు పక్కా ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నారని అన్నారు.
మహా వికాస్ అగాడీ ప్రభుత్వాన్ని, ఉద్ధవ్ ఠాక్రే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని ఛానళ్ళు ఇష్టానుసారం ప్రవర్తించటం ప్రతీకారం కాదా అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ముంబయ్ పోలీసుల నోటీసులు అందుకున్న రిపబ్లిక్ టీవీ సీఎఫ్ వో శివసుబ్రమణ్యం సుందరం శనివారం నాటి విచారణకు గైర్హాజరు అయ్యారు. ఈ అంశంపై రిపబ్లిక్ టీవీ సుప్రీంకోర్టును ఆశ్రయించినందున తాము విచారణకు హాజరు కాలేదని తెలిపినట్లు సమాచారం. వారంలోగా తమ పిటీషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని..అంత వరకూ తమ వాంగ్మూలం నమోదు వాయిదా వేయాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.