రాహుల్ ను అడ్డుకున్న హర్యానా పోలీసులు

Update: 2020-10-06 13:27 GMT

కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి హర్యానా పర్యటనలోనూ అడ్డంకులు ఎదురయ్యాయి. తాజాగా ఆయన హాధ్రాస్ పర్యటన సందర్భంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు హర్యానాలో అదే తంతు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆయన నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. పంజాబ్ లో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ మంగళవారం నాడు హర్యానాకు వచ్చారు. హర్యానా సరిహద్దుల్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. మూడు రోజుల ర్యాలీలో భాగంగా రాహుల్‌ పంజాబ్‌ నుంచి హర్యానా వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సరిహద్దులు తెరిచే వరకు ఇక్కడే ఉంటానని.. అందుకుగాను 500 గంటలు వేచి ఉండాల్సి వచ్చినా తనకు సంతోషమే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. ‘వారు మమ్మల్ని హర్యానా సరిహద్దులో ఒక వంతెన మీద ఆపారు. బార్డర్స్‌ తెరిచే వరకు నేను ఇక్కడే ఉంటాను. అందుకు రెండు గంటల సమయం పడుతుంది అంటే 2 గంటలు ఇక్కడే ఉంటాను. ఆరు గంటలు తీసుకుంటే ఆరు, 10, 10, 24 గంటలు, 24, 100 గంటలు, 200 గంటలు , 500 గంటలు పట్టినా సరే నేను కదలను" అన్నారు రాహుల్‌. అంతేకాక సరిహద్దును తెరిచాక శాంతియుతంగా ముందుకు వెళ్తానని అన్నారు. హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం వంద మందిని మాత్రమే రాష్ట్రంలో ప్రవేశించడానికి అనుమతిచ్చింది.

 

Similar News