వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు తన కంపెనీ, డైరక్టర్లపై నమోదు అయిన సీబీఐ కేసుపై స్పందించారు. కొద్ది రోజుల క్రితం సీబీఐ అధికారులు ఆయన కంపెనీలు, నివాసాల్లో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఆయన శుక్రవారం నాడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘సీఎం జగన్ ఈ నెల 6న ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. అదే రోజు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఛైర్మన్ సీఎం జగన్ ను కలవటం అనుమానాస్పదంగా ఉంది’ అని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజు కంపెనీలకు రుణాలకు పీఎన్ బీనే లీడ్ బ్యాంక్ గా ఉంది. తనకు బ్యాంకుల నుంచి మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలు రుణం మంజూరు అయితే అందులో రెండు వేల కోట్ల రూపాయలను తాను బ్యాంక్ ల నుంచి ఇంత వరకూ డ్రానే చేయలేదన్నారు.
తప్పుడు కథనాలు రాసిన వారిపై కేసులు వేయాలని తమ లాయర్లు సూచించారని...అయితే మూడు, నాలుగు నెలల్లో జైలుకు వెళ్ళే వారిపై ఇప్పుడు కేసులు ఎందుకు అని వ్యాఖ్యానించారు. సీబీఐ అడిగే ప్రశ్నలకు తాను సమాధానం ఇస్తానని..తనపై అనర్హత వేటు వేయించటం సాధ్యంకాదనే ఈ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ఆర్ధిక శాఖలో ఉన్న తన బ్యాచ్ మేట్ ద్వారా సీఎం కార్యాలయ ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాష్ తనపై కేసు వేయించేలా చేశారని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. నిధులు తాను తినేస్తే ప్రాజెక్టులు ఎవరు కడతరు అని ప్రశ్నించారు.