టీఆర్ పీ స్కామ్ కు సంబంధించి ముంబయ్ పోలీసులు శుక్రవారం నాడు రిపబ్లిక్ టీవీ సీఎఫ్ వో శివ సుబ్రమణ్యం సుందరానికి నోటీసులు జారీ చేశారు. తమ వద్ద నమోదు అయిన కేసుకు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. శనివారం ఉధయం పదకొండు గంటలకు అదనపు కమిషనర్ శశాంక్ ముందు హాజరు కావాలన్నారు. సీఆర్ పీసీ 160 కింద ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం నాడు ముంబయ్ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ విలేకరుల సమావేశం పెట్టి టీఆర్ పీ స్కామ్ కు సంబంధించిన వివరాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై రిపబ్లిక్ టీవీ ఎదురుదాడికి దిగింది. అసలు ఎఫ్ఐఆర్ లో తమ ఛానల్ పేరు లేకపోయినా తమను కావాలనే టార్గెట్ చేశారని ఆరోపించారు.
ఎఫ్ఐఆర్ లో పేరు ఉన్న ఇండియా టుడే టీవీ అంశాన్ని ప్రస్తావించలేదని..ఇది ముంబయ్ పోలీసుల తీరు అంటూ రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్ణాబ్ గోస్వామి మండిపడుతున్నారు. అంతే కాదు..ముంబయ్ పోలీసు కమిషనర్ చేసిన తప్పుడు ఆరోపణలకు సంబంధించి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో ముంబయ్ పోలీసులు రిపబ్లిక్ టీవీకు నోటీసులు జారీ చేయటం కీలకంగా మారింది. ఇండియా టుడే టీవీకి సంబంధించి ఇప్పటివరకూ తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.