జైలు నుంచి బయటికొచ్చి మళ్లీ తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న శశికళకు ఐటి శాఖ మరో షాక్ ఇఛ్చింది. శిక్షా కాలం పూర్తి చేసుకుని త్వరలోనే బయటకు రానున్నారు. ఈ తరుణంలో ఆమెకు సంబంధించిన రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులను ఐటి శాఖ అధికారులు స్తంభింపచేశారు. బినామీ నిరోధక చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీజ్ అయిన వాటిలో 300 కోట్ల రూపాయల విలువైన రెండు ఆస్తులున్నాయి.
సిరుతవుర్, కొడనాడు ప్రాంతాల్లోని ఈ ఆస్తులు జయలలిత సన్నిహితురాలు శశికళ, ఇలవరసి, సుధాకరన్‌ల పేరు మీద ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. స్తంభింపచేసిన ఆస్తులకు ఆదాయపన్ను శాఖకు చెందిన బినామీ నిరోధక విభాగం అధికారులు నోటీసులు అతికించారు. దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు అయిన శశికళ అక్రమాస్తుల కేసులో బెంగళూరు పర్పప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే.