దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న హాథ్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనలో ఉత్తరప్రదేశ్ పోలీసులకు షాక్ తగిలింది. బాధిత యువతిపై అత్యాచారం జరగలేదని..తీవ్ర గాయాలతోనే ఆమె మరణించినట్లు ఫోరెన్సిక్ నివేదిక తెలిపిందంటూ ఉత్తరప్రదేశ్ శాంతి భధ్రతల ఏడీజీ ప్రశాంత్ కుమార్ విలేకరుల సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. ఆయన ప్రకటనపైనే పెద్ద వివాదం చెలరేగింది. రేప్ జరిగిన 11 రోజుల తర్వాత ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక ఆధారంగా పోలీసులు ప్రకటన చేయటంపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయింది. ఉద్దేశపూర్వకంగానే కేసును నీరుగార్చేందుకు ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి చెందిన జవహర్ లాల్ నెహ్రు వైద్యకళాశాల నివేదికలో మాత్రం బాధితురాలు హత్యాచారానికి గురైనట్లు స్పష్టంగా వెల్లడించింది.
ఇది పోలీసులకు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు. అంతే కాదు బాధితురాలు న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలోనూ తాను గ్యాంప్ రేప్ నకు గురైనట్లు స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హాథ్రాస్ ను పూర్తిగా బ్లాక్ ఔట్ చేసి ఎవరూ బాధిత కుటుంబాన్ని కలవకుండా కొన్ని రోజుల పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. మీడియాతోపాటు రాజకీయ పార్టీ నేతలనూ అనుమతించలేదు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల హాథ్రాస్ పర్యటన ఉద్రిక్తంగా మారటం..తోపులాటలు దేశ వ్యాప్త చర్చకు తెరతీయటంతో ప్రభుత్వం చివరకు ఆంక్షలు నడలించింది. ఒత్తిడి మరీ పెరగటంతో ఈ కేసున సీబీఐ విచారణకు అప్పగించారు.