అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోం ఐసోలేషన్ నుంచి ఆస్పత్రికి మారారు. వైద్యుల పర్యవేక్షణలో మరింత మెరుగైన చికిత్స కోసం ఆయన్ను నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్ కు తరలించారు. డొనాల్డ్ ట్రంప్ తో ఆయన భార్య, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని..ఆయనకు ప్రత్యేకంగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం వంటివి కూడా ఏమీ లేవని వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. స్పెషలిస్టుల సంప్రదింపుల తర్వాత ట్రంప్ కు రెమిడెసివిర్ థెరపి ఇస్తున్నారు. తన మొదటి డోస్ ను పూర్తి చేసుకుని ఆయన ఎంతో సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ కూడా తాను ఆస్పత్రిలో చేరినా ఆరోగ్యంగానే ఉన్నాయని తెలియజేస్తూ ఓ స్వల్ప నిడివి వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. కరోనా బారిన పడిన తర్వాత మాత్రం అధ్యక్షుడు మాస్క్ ధరించి వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. అక్కడ నుంచి వాషింగ్టన్ బయట ఉన్న వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రికి వెళ్లారు.
ట్రంప్ వైద్యుల సూచన మేరకు కొద్ది రోజులు వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే ట్రంప్ ప్రత్యర్ధి జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాస్క్ ధరించకపోవడం వల్లే ట్రంప్‌కు ఈ పరిస్థితి తలెత్తిందని.. కాబట్టి జనాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ట్రంప్ తో కలసి డిబేట్ లో పాల్గొన్న జో బైడెన్, ఆయన భార్య జిల్ శుక్రవారం పరీక్షలు చేయించుకున్నారు. తమకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. ట్రంప్, అతని కుటుంబం కోసం తాను ప్రార్థిస్తున్నానని బైడెన్ తెలిపారు. ఏది ఏమయినప్పటికీ, కరోనావైరస్‌ని తీవ్రంగా పరిగణించినందుకు తాను దాని బారిన పడలేదని అమెరికన్లకు గుర్తుచేశాడు, తన ప్రత్యర్థిలా కాకుండా, తాను మాస్క్ ని ఖచ్చితంగా వాడానన్నారు. ఇక మాస్క్ ధరించడం అంటే దేశభక్తి కలిగి ఉండటమేనని.. ఎవరికోసమే కాక మీ కోసం ఈ పని చేయాలని కోరారు.