బీహార్ ఎన్డీయే కూటమిలో బీటలు. రామ్ విలాస్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జెపి) నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడీయూతో కలసి పోటీచేయబోమని ప్రకటించింది. జెడీయూ అభ్యర్ధులపై ఎల్ జెపి అభ్యర్ధులు బరిలో ఉంటారని..అయితే కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపితో పొత్తు కొనసాగుతుందని ప్రకటించింది. ఈ పరిణామం బీహార్ ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపించేదే.. రాష్ట్రస్ధాయిలో జేడీయూతో సిద్ధాంత వైరుధ్యాల నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేయాలని నిర్ణయించిందని ఎల్జేపీ నేత అబ్ధుల్ ఖలీక్ ఓ ప్రకటనలో తెలిపారు. బీహార్ ఫస్ట్-బీహారీ ఫస్ట్ నినాదంతో ఎల్జేపీ ఈ ఎన్నికల బరిలో ఒంటరి పోరుకు సిద్ధమైంది.
బీహార్ విజన్ డాక్యుమెంట్‌పైనా ఇరు పార్టీలు ఏకాభిప్రాయానికి రాలేదని, సిద్ధాంత వైరుధ్యాలతో తాము జేడీయూతో తెగతెంపులు చేసుకున్నామని ఆ పార్టీ పేర్కొంది. ఎన్నికల అనంతరం బీజేపీ-ఎల్జేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూపిన అభివృద్ధి బాటలో ముందుకు సాగుతామని తెలిపింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7న మూడు దశల్లో జరగనున్నాయి. నవంబర్ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.