తమిళనాడులోని అధికార అన్నాడీఎంకెలో సస్పెన్స్ కు తెరపడింది. దీంతో సంక్షోభం తాత్కాలికంగా ముగిసినట్లు అయింది. అన్నాడీఎంకె ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పళనిస్వామి పేరును పార్టీ ప్రకటించింది. విశేషం ఏమిటంటే పళనిస్వామి పేరును ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు. తదుపరి సీఎం అభ్యర్ధి పన్నీర్ సెల్వం అంటూ ఆయన గ్రూపు తమిళనాడులో పలు చోట్ల పోస్టర్లు వేయటంతో రాజకీయంగా ఒక్కసారిగా మారిపోయింది. అయితే అన్నాడీఎంకె పార్టీ అధినేతను ఖరారు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ అధ్యక్షుడిని ఖరారు చేయనుంది. అంతే కాకుండా అసెంబ్లీ ఎన్నికల కోసం 11 మంది స్టీరింగ్ కమిటీని ప్రకటించారు. అయితే జయలలిత స్నేహితురాలు శశికళ జైలు నుంచి బయటకు వచ్చాక రాజకీయాలు పూర్తిగా మారిపోతాయని చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు అయితే ఓ రాజీకి వచ్చినట్లు కన్పిస్తోంది.వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్నాడీఎంకె ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపిక వ్యవహారం అత్యంత కీలకంగా మారింది.