మీడియాపై బాలీవుడ్ ఫైర్ అయింది. గత కొన్ని రోజులుగా రియా చక్రవరికి సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలపై వీరంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రియాపై మీడియా ఓ రకంగా దాడి చేస్తోందని వీరు ఆరోపించారు. ఈ దాడిని తాము ఖండిస్తున్నట్లు నటి సోనమ్ కపూర్, దర్శకులు అనురాగ్ కశ్యప్, గౌరి షిండే, జోయా అక్తర్ సహా 2,500 మంది భారతీయ మీడియాకు బహిరంగ లేఖ రాశారు. దీనిపై సుమారు 60 ఆర్గనైజేషన్లు సంతకం చేశాయి. ‘వార్తల్ని వేటాడండి. మహిళల్ని కాదు’ అనే శీర్షికతో ఈ లేఖను రూపొందించారు. ‘‘రియా చక్రవర్తి మీద కొనసాగుతున్న మీ వేటను చూస్తుంటే.. జర్నలిజం యొక్క నీతిని, మానవ మర్యాద, గౌరవాన్ని సిద్ధాంతాన్ని ఎందుకు విడిచిపెట్టారోననే అనుమానం కలుగుతోంది. అంతే కాకుండా మీ కెమెరాలతో ఒక యువతిపై శారీరక దాడి చేయాలని ఎందుకు ఎంచుకున్నారో మాకు అర్థం కాలేదు. 'రియాను బంధించండి' అనే నాటకంతో తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆమె గోప్యతను దెబ్బతీస్తున్నారు.
ఆమెపై సందేహాస్పద విచారణే కొనసాగుతోంది. దర్యాప్తు సంస్థలు ఆమె నిందితురాలని నిర్ధారించలేదు. చట్టం ప్రకారం.. ఆమెకు మిగతా వారికి ఉన్న హక్కులు ఉంటాయి. కానీ వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ఆమెపై ఊహాజనితమైన కథనాల్ని రూపొందించడంలో మీరు నిమగ్నమయ్యారు. గతంలో మీరు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌ల పట్ల ఎలా వ్యవహరించారో ప్రపంచానికి తెలియనిది కాదు. వారి కుటుంబాలు, అభిమానులు, వృత్తి గురించి ఆలోచనలు జరిగాయి. కానీ నేరం చేసినట్లు ఇంకా నిరూపణ కాని ఒక యువతి వ్యక్తిత్వాన్ని మీరు హతమారుస్తున్నారు. ఆమెను, ఆమె కుటుంబాన్ని కుటుంబాన్ని చంపడానికి ఆన్‌లైన్ గుంపును ప్రేరేపిస్తున్నారు. అనేక తప్పుడు డిమాండ్లకు ఆజ్యం పోశారు.’ అంటూ మండిపడ్డారు.