హెచ్ 1 బీ వీసాలపై జో బిడెన్ కీలక ప్రకటన

Update: 2020-07-02 11:35 GMT

అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమొక్రాట్ల ప్రెసిడెంట్ అభ్యర్ధి జో బిడెన్ కీలక ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ 1 బీ వీసాలపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని ఎత్తేస్తామని ప్రకటించారు. కరోనా దెబ్బకు అతలాకుతలం అయిన అమెరికాలో స్థానికులే ఉద్యోగాలు అన్న నినాదంతో ట్రంప్ వీసాల అంశంపై పలు కఠిన ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు. దీనిపై టెక్ దిగ్గజ సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా ఆయన వాటిని ఏ మాత్రం పట్టించుకోవటంలేదు. ఈ తరుణంలో జో బిడెన్ ప్రకటన కీలకంగా మారింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే, మొదటి రోజే ఈ దేశానికి ఎంతో సహకారం అందించే 11 మిలియన్ల మంది వలసదారుల పౌరసత్వానికి సంబంధించి కాంగ్రెస్‌కు ఇమ్మిగ్రేషన్ సంస్కరణల రోడ్‌మ్యాప్ బిల్లును పంపుతామని జో బిడెన్ ప్రకటించారు. తమ ఇమ్మిగ్రేషన్ విధానం వైవిధ్యంగా ఉండబోతోందని తెలిపారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు అమానవీయమైనవనీ, క్రూరమైనవని ఆయన ఆరోపించారు. అధ్యక్ష పదవిలో మొదటి 100 రోజుల పరిపాలనలో చేపట్టబోయే కీలక చర్యలపై ప్రశ్నించినపుడు జో బిడెన్ హెచ్ 1 బీ వీసాలపై ప్రకటన చేశారు.

Similar News