ఓ వైపు అందరినీ అలా ఆశల్లో విహరింపచేశారు. అంతలోనే కాదు..కాదు అసలు సాధ్యం కాదు అంటున్నారు. ఆగస్టు 15 నాటికి కరోనా వ్యాక్సిన్ రెడీ అయ్యే అవకాశం ఉందంటూ ఐసీఎంఆర్ అంతర్గత నోట్ వెల్లడించింది. ఇది చూసిన వారు అంతా అహా అంటూ హాయిగా ఊపిరి పీల్చుకుందామనుకున్నారు. కానీ ఈ ఐసీఎంఆర్ నోట్ పై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ రంగంలోని నిపుణులు అంతా అసలు అది ఎలా సాధ్యం అంటూ విమర్శలు గుప్పించటంతో దీనిపై ఐసీఎంఆర్ కూడా వెనకడుగు వేసింది. తాజాగా కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ 2021 ముందుకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం కష్టమే అని తేల్చిచెప్పింది. ఇదే మాటను ఎక్కువ మంది చెబుతున్నారు. మరి ఐసీఎంఆర్ ప్రపంచం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వ్యాక్సిన్ విషయంలో ఎందుకంత అత్సుత్సాహం చూపించింది. దీని వెనక ఏమైనా రాజకీయ కోణాలు ఉన్నాయా?. దీన్ని కూడా రాజకీయం చేద్దామనుకున్నారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
అన్ని అనుమతులు పూర్తి చేసుకుని వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే ఎన్నో సంకిష్టమైన దశలు దాటాల్సి ఉంటుందని ఈ రంగంలోని నిఫుణులు చెబుతున్న మాట. ఇది చాలా సమయం తీసుకునే వ్యవహారం. దేశంలో భారత్ బయోటెక్ కు చెందిన కోవాక్సిన్ తోపాటు జైడస్ కు చెందిన వ్యాక్సిన్ లు రెండూ క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నాయి. వీటితోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధనలు సాగుతున్నాయి. 140 కంపెనీలు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో ఏ ఒక్కటి కూడా 2021 కి ముందు అందుబాటులోకి రావటం సాధ్యంకాదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ కు సంబంధించిన అంశంపై పీఐబి ఆదివారం నాడు ఓ నోట్ విడుదల చేసింది. డాక్టర్ టీ వీ వెంకటేశ్వర్ పేరుతో విడుదల చేసిన ఈ నోట్ లోనూ 2021 లోపు వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావటం కష్టం అని పేర్కొన్నారు. దీంతో ఐసీఎంఆర్ చెప్పినట్లు ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం కష్టమే అని తేలిపోయింది.