దేశీయ ఎయిర్ లైన్స్, మెట్రో రైళ్ళకూ నో ఛాన్స్
హోం డెలివరి రెస్టారెంట్లకు అనుమతి
మాల్స్, బార్లు, థియేటర్ల కూ నో ఛాన్స్
నాల్గవ దశ లాక్ డౌన్ లో దక్కిన పెద్ద ఊరట ఏదైనా ఉంది అంటే అది కేవలం అంతర్ రాష్ట్ర రవాణాకు అనుమతి మాత్రమే. అయితే ఇది కూడా షరతులతో మాత్రమే. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరస్పర ఆమోదంతోనే ప్రయాణికుల వాహనాలు, బస్ లను అనుమతిస్తారని కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అదే సమయంలో రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్ల గుర్తింపు ప్రక్రియను రాష్ట్రాలకే అప్పగించారు. అయితే కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రమాణాల ప్రకారమే ఇది చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రెడ్, ఆరెంజ్ జోన్లతోపాటు కంటైన్ మెంట్ జోన్లలో ఖచ్చితంగా ప్రజల కదలికలను నియంత్రించాలన్నారు. ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ రాత్రి కర్ఫ్యూను కొనసాగించాలని ఆదేశించారు.
ఈ సారి లాక్ డౌన్ మినహాయింపుల్లో దేశీయ విమాన సర్వీసులకు అనుమతి వస్తుందని అందరూ ఆశించినా నిరాశే ఎదురైంది. కేంద్రం తాజాగా మే 31 వరకూ లాక్ డౌన్ ను పొడిగించింది. దీంతో అన్ని దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని ప్రకటించారు. రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లు, మైట్రో రైలు సర్వీసులు కూడా ఇప్పట్లో తెరుచుకోవు. వీటితోపాటు స్కూళ్ళు, కాలేజీలు, ఇతర విద్యా, శిక్షణా సంస్థలపై నిషేధం కొనసాగుతుంది. హోటళ్ళు, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలకూ మినహాయింపు దక్కలేదు. హోం డెలివరి చేసే రెస్టారెంట్లకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, స్విమ్మింగ్ పూల్స్,, ఎంటర్ టైన్ మెంట్ పార్క్ లు, థియేటర్లు, బార్లు, ఆడిటోరియంలకు అనుమతి లేదు. అన్ని మత ప్రదేశాలపై నిషేధం కూడా కొనసాగనుంది.