ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల విషయంలో తన వైఖరి మార్చుకోవాలని బిజెపి ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సూచించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తామనటం సరికాదన్నారు. కన్నా లక్ష్మీనారాయణను మంగళవారం నాడు అమరావతి రైతులు కలిశారు. ప్రధాని నరేంద్రమోడీని కలసి తమ సమస్యలను విన్నవించాలని కోరారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ జగన్ పరిపాలనతో ప్రజలు సంతోషంగా లేరన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలు లక్షలాది మందిపై ప్రభావం చూపిస్తాయని, అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆచితూచి అడుగువేయాలని సూచించారు.ముఖ్యమంత్రి వైఖరిలో కక్ష సాధింపు దోరణి కన్పిస్తోందని కన్నా ఆరోపించారు. ఇలా ముందుకెళితే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవని వ్యాఖ్యానించారు. నియంతృత్వ ధోరణి ఎవరికీ మంచిదికాదని వ్యాఖ్యానించారు. రాజధాని రైతులకు బిజెపి అండగా ఉంటుందని తెలిపారు.