రాజధాని మార్పు నిర్ణయం అమరావతిలో గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇది రోజు రోజుకూ ఉధృతంగా మారుతోంది. శుక్రవారం నాడు కేబినెట్ సమావేశంలో రాజధానిపై తుది నిర్ణయం వెలువడనుండటంతో రైతులు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. దీంతో పోలీసులు రైతులపై పలు ఆంక్షలు పెట్టారు. కేబినెట్ రోజు ఆందోళనలు వద్దని..కొత్త వారిని ఎవరినీ అనుమతించవద్దని ఆదేశించారు. ఈ తరుణంలో అమరావతిలో నెలకొన్న పరిస్థితులపై మండలిలో విపక్ష నేత యనమల రామకృష్ణ స్పందించారు.
రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చారని ,రాజధాని ప్రాంతంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని యనమల రామకృష్ణుడు విమర్శించారు. అణచివేతతో అధికారాన్ని చలాయిస్తున్నారని ఆరోపించారు. క్యాబినెట్ సమావేశం పేరుతో అమరావతి ప్రాంతాన్ని పోలీసు మయం చేశారని ఆయన అన్నారు. భూములిచ్చిన రైతులను దొంగలుగా చూస్తారా? వాళ్ల ఇళ్ల తలుపులకు నోటీసులు అంటించే తప్పు ఏంచేశారు? రాజధాని గ్రామాల్లో యుద్ధ వాతావరణం సృష్టించారు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడిన రాజధానిని ఏవిధంగా మార్చుతారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.